Mahua Moitra Expelled From Lok Sabha :లోక్‌సభ నుంచి తనను బహిష్కరించడంపై టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా తీవ్రంగా మండిపడ్డారు. తన బహిష్కరణను కంగారూ కోర్టు(పెద్ద మనుషుల పంచాయతీ) ఉరి తీయమని ఇచ్చిన తీర్పుతో సమానమని విమర్శించారు. విపక్షాలను లొంగదీసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం లోక్‌సభ ఎథిక్స్ కమిటీని ఆయుధంగా వాడుకుంటోందని ఆరోపించారు.
లోక్‌సభ ఎథిక్స్ కమిటీ ప్రతి నిబంధనను ఉల్లంఘించిందని బహిష్కరణకు గురైన ఎంపీ మహువా మొయిత్రా విమర్శించారు. 'ఎలాంటి ఆధారాలు లేకుండా కేవలం ఇద్దరు వ్యక్తులు చెప్పిన మాటలను నమ్మి నన్ను దోషిగా నిర్ధారించారు. ఇక, రేపు మా ఇంటికి సీబీఐని పంపించి నన్ను వేధిస్తారేమో' అని మహువా మండిపడ్డారు.
"డబ్బులు, కానుకలు తీసుకున్నట్లు ఎక్కడా లేదు. నా లోక్‌సభ పోర్టల్ లాగిన్ ఇతరులకు ఇచ్చారనే అభియోగాలతో బహిష్కరణకు సిఫార్సు చేశారు. ఏమైనప్పటికీ లాగిన్ ఇతరులకు ఇచ్చే విషయమై ఎలాంటి నిబంధనలు లేవని విచారణ సందర్భంగా నైతిక విలువల కమిటీ చెప్పింది. దీంతో ప్రజల సమస్యలను తెలుసుకొని పార్లమెంటు లేవనెత్తే విషయమై ఎంపీలందరికీ హెచ్చరిక చేశారు. నా నోరు మూయించటం ద్వారా అదానీ అంశాన్ని దారి మళ్లించవచ్చని మోదీ ప్రభుత్వం అనుకుంటోంది. ఈ వ్యవహారంలో త్వరితగతిన చేపట్టిన విచారణ ప్రక్రియ, దుర్వినియోగం అదానీ వారికి ఎంత ముఖ్యమో ఈ కంగారూ కోర్టు దేశం మొత్తానికి చూపించింది. నా నోరు మూయించి ఒంటరి మహిళా ఎంపీని వేధించడానికి మీరు ఎంతవరకు వెళ్తారు. రేపు సీబీఐని మా ఇంటికి పంపుతారని నాకు తెలుసు. వచ్చే 6నెలలపాటు నన్ను వేధిస్తారు."
-మహువా మొయిత్రా, బహిష్కరణకు గురైన ఎంపీ
మరోవైపు, అదానీ వ్యవహారంపై కేంద్రం వ్యవహరిస్తున్న తీరుపై మహువా మొయిత్రా మండిపడ్డారు. '13వేల కోట్ల బొగ్గు కుంభకోణం సంగతేమిటీ? అదానీ విషయాన్ని సీబీఐ, ఈడీ ఎందుకు పట్టించుకోవటం లేదు. పోర్టల్ లాగిన్ పంచుకోవటం ద్వారా జాతీయ భద్రతతో రాజీపడ్డానా మీరు చెప్పండి? అదానీ అన్ని పోర్టులను, విమానాశ్రయాలను కొనుగోలు చేస్తున్నారు. దేశంలోని మౌలిక సదుపాయాలను కొనుగోలు చేసేందుకు అతని వాటాదారులు, ఎఫ్‌ఎఫ్‌ఐలకు విదేశీ వ్యవహారాల శాఖ క్లియరెన్స్ ఇస్తోందా? మీకు మైనార్టీలు, మహిళలు అంటే ద్వేషం. నారీశక్తిని ద్వేషిస్తున్నారు. 49ఏళ్ల వయసున్న నేను వచ్చే 30ఏళ్లు పార్లమెంటు లోపల, బయట పోరాటం చేస్తూనే ఉంటా' అని మహువా ఆరోపించారు.