Mahindra salesman mocks farmer: 'కర్ణాటకలోని మహీంద్రా షోరూంలో రైతుకు జరిగిన అవమానం ఘటన' ఎట్టకేలకు సుఖాంతం అయింది. రైతు కెంపెగౌడ ఆర్డర్ చేసిన బొలెరో పికప్ ట్రక్కును ఇంటికే వచ్చి అప్పగించారు. ఈ మేరకు షోరూంలో పనిచేసే సిబ్బంది, అధికారులు గౌడకు క్షమాపణలు చెప్పారు.
"షోరూం సిబ్బంది వాళ్లంతట వాళ్లే వచ్చి బొలెరో పికప్ ట్రక్కు డెలివరీ చేశారు. ఇలాంటి అవమానం ఎవరికీ జరగకూడదనే నేను కోరుకుంటున్నా. బొలెరో ధర. రూ. 9.40లక్షలు. డిస్కౌంట్ ఏమీ లేదు. ఒకవేళ వాళ్లు ఏమైనా డిస్కౌంట్ ఇచ్చినా నేను తీసుకోను. వాహనం సమయానికి వచ్చినందుకు సంతోషంగా ఉంది."
-- కెంపెగౌడ, రైతు
దీనిపై మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా మరోసారి ట్వీట్ చేశారు.
" మహీంద్రా అండ్ మహీంద్రా కుటుంబంలోకి రావాలన్న ఆహ్వానాన్ని స్వీకరించండి"
-- ఆనంద్ మహీంద్రా, మహీంద్రా గ్రూప్ ఛైర్మన్
అంతకుముందు ఇదే విషయంపై మహీంద్రా ఆటోమోటివ్ ట్వీట్ చేసింది.
జనవరి 21న మహీంద్రా షోరూంలో రైతు కెంపెగౌడ, అతని స్నేహితులకు జరిగిన అవమానానికి మేము చింతిస్తున్నాం. మాట ఇచ్చినట్లుగానే.. మేము తగిన చర్యలు చేపట్టాం. సమస్య ఇప్పుడు పరిష్కారం అయింది. మహీంద్రా సంస్థను ఎంచుకున్నందుకు రైతు కెంపెగౌడకు ధన్యవాదాలు. మహీంద్రా కుటుంబంలోకి కెంపెగౌడకు స్వాగతం."