Mahatma Gandhi National Rural Employment Guarantee Scheme :మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎంజీఎన్‌ఆర్‌ఈజీఎస్) ద్వారా కూలీలకు అందించే వేతనాలు ఇకపై నేరుగా వారి బ్యాంకు ఖాతాలకే జమ కానున్నాయి. కూలీల ఆధార్ సంఖ్యతో అనుసంధానమై ఉన్న బ్యాంకు ఖాతాలకు అవి చేరనున్నాయి. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వ వర్గాలు సోమవారం వెల్లడించాయి.
కేంద్ర ప్రభుత్వ గణాంకాల ప్రకారం, దేశంలో ఉపాధి హామీ కూలీలుగా నమోదైన వారి సంఖ్య మొత్తం 25.89 కోట్లుగా ఉంది. వీరిలో క్రియాశీల శ్రామికులు 14.28 కోట్ల మంది కాగా జాబ్ కార్డుతో ఆధార్ సీడింగ్ పూర్తైన వారు 13.48 కోట్ల మంది ఉన్నారు. ఆధార్‌తో అనుసంధానం జరిగిందని ధ్రువీకరణ పొందిన వారు 12.90 కోట్లు ఉన్నారు. ఇప్పటి వరకు ఏబీపీఎస్‌కు అర్హులైన ఉపాధి హామీ కూలీల సంఖ్య 12.49 కోట్లుగా ఉంది.
ఆధార్ ఆధారిత చెల్లింపుల వ్యవస్థ (ఏబీపీఎస్)కు మారడాన్ని తప్పనిసరి చేస్తూ రాష్ట్రాలకు కేంద్రం ఇచ్చిన చివరి గడువు డిసెంబరు 31తో ముగిసింది. ఈ గడువును ఇక మీదట పెంచబోమని ఇదివరకే కేంద్రం స్పష్టం చేసింది. అంతకుముందు నాలుగు సార్లు (గత ఏడాది మార్చి 31, జూన్ 30, ఆగస్టు 31, డిసెంబరు 31 వరకు) ఈ గడువును పెంచుకుంటూ వచ్చింది.
సమస్యలున్న చోట మాత్రమే మరో ఛాన్స్!
ఉపాధి హామీ కూలీలకు జనవరి 1 నుంచి ఆధార్ ఆధారిత చెల్లింపులను తప్పనిసరి చేయడంపై వివిధ వర్గాల నుంచి వస్తున్న విమర్శలకు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ వివరణ ఇచ్చింది. ఏదైనా గ్రామ పంచాయతీలో ఆధార్ ఆధారిత చెల్లింపులు చేయడానికి సాంకేతిక సమస్యలు కానీ, ఆధార్‌పరమైన ఇబ్బందులు కానీ తలెత్తినప్పుడు సంబంధిత కేసులకు మాత్రమే ఈ నిబంధన నుంచి మినహాయింపు ఇవ్వనున్నట్లు తెలిపింది. అది కూడా ఆ సమస్య పరిష్కారమయ్యేంత వరకేనని పేర్కొంది.
'పథకం లబ్ధిదారులను తగ్గించేందుకే ఇలా!'
ఉపాధి హామీ జాబ్ కార్డుకు ఆధార్ అనుసంధానాన్ని తప్పనిసరి చేయడంపై కాంగ్రెస్ పార్టీ మండిపడింది. ఆధార్ లేదనే సాకుతో నిరుపేదలకు సామాజిక సంక్షేమ పథకాలను దూరం చేసేందుకు మోదీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించింది. దీనికి సాంకేతికతను ఆయుధంగా ఉపయోగించుకుంటోందని ధ్వజమెత్తింది. 'ఆధార్ లేకున్నా ఉపాధి పనులకు అర్హత కల్పిస్తామని చెప్పింది కేంద్ర ప్రభుత్వం. ఇప్పుడు ఏబీపీఎస్‌ను తప్పనిసరి చేస్తే కూలీలకు డబ్బు ఎలా చెల్లిస్తుంది?' అని కాంగ్రెస్ ప్రశ్నించింది.
'ఉపాధి హామీ కింద కేంద్రం 16 కోట్ల పనిదినాలు కల్పించాలి'
ఉపాధి హామీకి మొండిచెయ్యి.. బడ్జెట్లో అరకొర నిధులు.. కోట్ల మందికి నిరాశ!