జాతిపిత మహాత్మా గాంధీ మనవడు అరుణ్ గాంధీ (89) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మంగళవారం మహారాష్ట్ర కొల్హాపుర్‌లోని నివాసంలో తుది శ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. అరుణ్ గాంధీ అంత్యక్రియలు మంగళవారం సాయంత్రం కొల్హాపుర్ వాషిలోని గాంధీ ఫౌండేషన్ ప్రాంగణంలో నిర్వహించనున్నట్లు కుమారుడు తుషార్ గాంధీ చెప్పారు.
యూనివర్సిటీలో అహింస కోసం సంస్థ..
1934, ఏప్రిల్ 14న దక్షిణాఫ్రికాలోని డర్బన్‌లో మణిలాల్ గాంధీ, సుశీలా మష్రువాలా దంపతులకు జన్మించారు అరుణ్ గాంధీ. ఈయన రచయితగా, సామాజిక, రాజకీయ కార్యకర్తగా తన తాత మహాత్మా గాంధీ అడుగుజాడల్లో నడిచారు. అరుణ్ గాంధీ గత రెండు నెలలుగా కొల్హాపుర్‌లోని హన్బర్‌వాడిలో గాంధీ అవని సంస్థ అధ్యక్షురాలు అనురాధ భోసలే ఇంట్లో నివాసం ఉంటున్నారు.
1987లో కుటుంబంతో సహా అమెరికాలో స్థిరపడిన అరుణ్ గాంధీ.. అక్కడ ఓ యూనివర్సిటీలో అహింసకు సంబంధించిన సంస్థను కూడా స్థాపించారు. అంతేకాకుండా తాత మహాత్మా గాంధీ స్ఫూర్తితో సామాజిక, రాజకీయ రంగాల్లో విశేషమైన కృషి చేశారు. 'ది గిఫ్ట్ ఆఫ్ యాంగర్', 'అదర్ లెసన్స్ ఫ్రమ్ మై గ్రాండ్ ఫాదర్ మహాత్మా గాంధీ' అనే పుస్తకాలను రాశారు అరుణ్ గాంధీ. అరుణ్ గాంధీకి కుమారుడు తుషార్ గాంధీ, కూతురు అర్చన, మనవరాళ్లు ఉన్నారు. ఆయన వృత్తిరీత్యా జర్నలిస్టు. జాతిపిత మహాత్మా గాంధీ ఆలోచనలకు ఆయన ఎక్కువ ప్రభావితమయ్యారు.
'నేటి విద్యా వ్యవస్థ వ్యాపారంలా మారింది': అరుణ్ గాంధీ
కొన్నేళ్ల క్రితం హైదరాబాద్ హయత్‌నగర్‌లోని సరితా విద్యానికేతన్ పాఠశాల నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు మహత్మా గాంధీ మనుమడు తుషార్ అరుణ్ గాంధీ. దేశంలోని విద్యా వ్యవస్థపై ఘాటైన వ్యాఖ్యలు చేశారు. నేటి విద్యా వ్యవస్థ వ్యాపార, ధనార్జనగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. భారతదేశ సంస్కృతి సంప్రదాయాలు ప్రపంచానికే ఆదర్శమని వాటిని కాపాడాలని కోరారు. జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలంటే క్రమశిక్షణతో కష్టపడి చదవాలని.. పుస్తక పఠనం అలవాటు చేసుకోవాలని విద్యార్థులకు మహత్మా గాంధీ మనుమడు తుషార్ అరుణ్ గాంధీ సూచించారు. నవ సమాజ నిర్మాణానికి పునాది విద్యాలయాలేనని అన్నారు. పిల్లల కోసం సమయాన్ని కేటాయించి.. వారితో గడపాలని తల్లిదండ్రులకు సూచించారు. ఈ వార్త పూర్తి వివరాల కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి.