Maharastra Political Crisis : మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి, ఎన్సీపీ నేత అజిత్ పవార్.. తన మనసులోని మాటను బయటపెట్టారు. తాను రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నట్లు చెప్పారు. ప్రజల సంక్షేమం కోసం తాను కొన్ని పథకాలను రూపొందించినట్లు తెలిపారు. తన వర్గం ఎమ్మెల్యేలు, ఎంపీలతో బాంద్రాలో ఉన్న ముంబయి ఎడ్యుకేషన్ ట్రస్ట్ (ఎంఈటీ) భవనంలో బుధవారం ఏర్పాటు చేసిన సమావేశంలో అజిత్ పవార్ ఈ వ్యాఖ్యలు చేశారు.
"అందరి ముందు నన్ను విలన్‌గా చూపించారు. అయినా ఆయన (శరద్‌పవార్)పై ఇప్పటికీ నాకు చాలా గౌరవం ఉంది. ఐఏఎస్ అధికారులు 60 ఏళ్లకే రిటైర్ అవుతారు. బీజేపీ నేతలు 75 ఏళ్లకే పదవీ విరమణ చేస్తున్నారు. ఎల్‌కే అడ్వాణీ, మురళీ మనోహర్ జోషీని ఉదాహరణగా తీసుకోండి. ఇప్పుడు మీకు (శరద్ పవార్) 83 ఏళ్లు. ఇప్పటికీ కొనసాగుతారా?.. మాకు మీ ఆశీస్సులు అందించండి. మా ఆరాధ్య దైవమైన మీరు చిరకాలం జీవించాలని ప్రార్థిస్తాం."
-- అజిత్ పవార్, మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి
Ajit Pawar Sharad Pawar : నరేంద్ర మోదీ చరిష్మా వల్లే 2014లో రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిందని అజిత్ పవార్ అన్నారు. 2004లో కాంగ్రెస్ కంటే ఎక్కువ మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ ఎన్సీపీ.. శరద్‌పవార్ వల్లే సీఎం పదవిని కోల్పోయిందని విమర్శించారు. అజిత్ పవార్ ఏర్పాటు చేసిన సమావేశానికి 35 మంది ఎమ్మెల్యేలు, 5 మంది ఎమ్మెల్సీలు హాజరయ్యారని సమాచారం.
"2017లో వర్ష బంగ్లాలో జరిగిన సమావేశానికి పార్టీ సీనియర్ నేతల ఆదేశాల మేరకు ఛగన్ భుజ్‌బల్, జయంత్ పటేల్, నేను వెళ్లాం. బీజేపీకి చెందిన పలువురు నేతలు కూడా ఉన్నారు. క్యాబినెట్ విస్తరణ, మంత్రి పదవులపై మా మధ్య చర్చలు జరిగాయి. కానీ తర్వాత మా పార్టీ ఒక అడుగు వెనక్కి వేసింది" అని అజిత్ పవార్ వెల్లడించారు. మహా వికాస్ అఘాడీ ప్రభుత్వం కూలిపోతునప్పుడు ఎన్సీపీ నేతలంతా.. బీజేపీతో కలిసి వెళ్లమని శరద్ పవార్‌ను అభ్యర్థించారని అజిత్ పవార్ వర్గం నేత ప్రఫుల్ పటేల్ తెలిపారు.
ప్రజల కోసం పని చేస్తూనే ఉంటాం: శరద్ పవార్
ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్.. బీజేపీపై మండిపడ్డారు. ఎన్సీపీ ఓ అవినీతిపరుల పార్టీ అన్న బీజేపీ నేతలు.. అజిత్ పవార్ వర్గంతో ఎలా పొత్తుపెట్టుకున్నారని ప్రశ్నించారు. ఉద్ధవ్ ఠాక్రేకు ఏం జరిగిందో అదే పునరావృతమైందని విమర్శించారు. ప్రజల ప్రయోజనాల గురించి పట్టించుకోని వారి చేతుల్లోనే దేశ పగ్గాలు ఉన్నాయని ఆరోపించారు.
"అజిత్ పవార్‌కు ఏమైనా సమస్యలు ఉంటే నాతో మాట్లాడి ఉండాల్సింది. ఆయన మనసులో ఏదైనా ఉంటే నన్ను సంప్రదించి ఉంటే బాగుండేది. పార్టీ గుర్తు మా దగ్గరే ఉంది, అది ఎక్కడికీ పోదు. మమ్మల్ని అధికారంలోకి తీసుకొచ్చిన ప్రజలు, పార్టీ కార్యకర్తలు మా వెంటే ఉన్నారు. మాకు అధికారం కోసం ఆకలి లేదు. ప్రజల కోసం పని చేస్తూనే ఉంటాం. ఈరోజు దేశం మొత్తం మనల్ని గమనిస్తోంది. ఎన్సీపీకి ఈ సమావేశం చరిత్రాత్మకం. మన మార్గంలో ఎన్ని అడ్డంకులు ఎదురైనా మనం ముందుకు సాగాలి"
-- శరద్ పవార్, ఎన్సీపీ అధ్యక్షుడు
'మమ్మల్ని అనండి.. మా నాన్నను కాదు..'
అజిత్ పవార్ చేసిన వ్యాఖ్యలపై ఎన్సీపీ వర్కింగ్ ప్రెసిడెంట్, శరద్ పవార్ కుమార్తె సుప్రియా సూలే స్పందించారు. "మమ్మల్ని అగౌరవపరచండి. కానీ మా నాన్నను (శరద్ పవార్) కాదు. బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగానే మా పోరాటం. దేశంలో బీజేపీ అత్యంత అవినీతికరమైన పార్టీ" అని విమర్శించారు. ముంబయిలోని వైబీ చవాన్ సెంటర్‌లో శరద్ పవార్ నేతృత్వంలో జరిగిన సమావేశానికి మొత్తం 13 మంది ఎమ్మెల్యేలు, 3 ఎమ్మెల్సీలు, 5 మంది ఎంపీలు హాజరయ్యారనట్లు సమాచారం.
ఈసీ వద్దకుబాబాయ్ X అబ్బాయ్ పోరు
ఎన్సీపీలో వర్గ పోరు.. ఎన్నికల సంఘానికి చేరింది. ఎన్సీపీ గుర్తు, పార్టీ పేరు విషయమై అజిత్ పవార్ ఈసీకి దరఖాస్తు చేసుకున్నారు. తమకే ఆ రెండింటినీ కేటాయించాలని ఆయన తన పిటిషన్లో కోరారు. అంతకుముందే పార్టీ పేరు, పార్టీ గుర్తుపై తమకే పూర్తి అధికారం ఉందంటూ శరద్ పవార్ వర్గం కేవియట్ దాఖలు చేసింది. ఈ విషయంపై తమను సంప్రదించకుండా ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దని ఎన్నికల సంఘాన్ని శరద్ పవార్ వర్గం కోరింది.
పార్టీ నేతలతో ఉద్ధవ్ ఠాక్రే సమావేశం..
మరోవైపు, మాతోశ్రీలో మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే.. తన వర్గం నాయకులతో సమావేశం నిర్వహించారు. ప్రజల సమస్యలను పరిష్కరించాలని సూచించారు. ఉద్ధవ్ ఠాక్రే జులై 9 నుంచి రాష్ట్రవ్యాప్తంగా పర్యటించనున్నారు.