మహారాష్ట్రలోని శిర్డీకి వెళ్లే భక్తులు ఆ సాయినాథుడ్ని దర్శనం చేసుకోవడం తమ పూర్వజన్మ సుకృతంగా భావిస్తారు. అదే విధంగా బాబా హుండీలో కూడా కానుకలను తమ స్థాయికి తగ్గట్టుగా సమర్పిస్తుంటారు. ఈ ఏడాది బాబా సంస్థాన్‌కు దాదాపు రూ.400 కోట్లకుపైగా కానుకలు వచ్చాయి.
జనవరి 1 నుంచి డిసెంబర్ 26 వరకు అన్ని విధాలుగా మొత్తం రూ.394 కోట్ల 28 లక్షల 36 వేల విరాళాలు వచ్చాయి. డిసెంబర్ 31 వరకు వచ్చే విరాళాలతో దాదాపు 400 కోట్ల రికార్డును దాటే అవకాశాలున్నాయని అధికారులు చెబుతున్నారు.
డిసెంబర్ 26 వరకు వచ్చిన విరాళాల వివరాలు:
- హుండీ- రూ.165 కోట్ల 55 లక్షలు
- విరాళం కౌంటర్- రూ.72 కోట్ల 26 లక్షల 27
- డెబిట్, క్రెడిట్ కార్డ్- రూ.40 కోట్ల 74 లక్షలు
- ఆన్‌లైన్ విరాళం- రూ.81 కోట్ల 79 లక్షలు
- చెక్కు, డీడీ- రూ.18 కోట్లు, 65 లక్షలు
- మనీ ఆర్డర్- రూ.1 కోటి 88 లక్షలు
- బంగారం- 25 కిలోల 578 గ్రాములు (రూ.11 కోట్ల 87 లక్షలు)
- వెండి- 326 కిలోల 38 గ్రాములు (రూ.1 కోటి 51 లక్షలు)
సాయి సంస్థాన్‌కు చెందిన విదేశీ మారకద్రవ్య ఖాతా లైసెన్స్ రెన్యూవల్ పెండింగ్‌లో ఉన్నందున కోట్లాది రూపాయల విదేశీ చందా ఈసారి రాలేదు. దీని ద్వారా ఏటా 15 నుంచి 20 కోట్ల రూపాయలు వస్తున్నాయి. సంస్థ ఏర్పాటైన తర్వాత మొదటి ఏడాది 1922 తొలి ఏడాది భక్తులు ఇచ్చిన చందాలు రూ. 2388 మాత్రమే. మొత్తంగా ఆ ఏడాది ఆ సంస్థకు రూ.3709 చందాలు వచ్చాయి. ఆ తర్వాత 1963-65 వరకు 25 మంది భక్తులు మాత్రమే చందాదారులుగా ఉన్నారు. 1936 ఫిబ్రవరిలో హుండీలో 43 రూపాయలు మాత్రమే ఉన్నాయి. దానిలో 29 రూపాయలు సంస్థ స్వయంగా డిపాజిట్ చేసింది. ఇప్పుడు శిర్డీ సంస్థాన్‌కు రోజుకు కోటికి పైగా విరాళాలు వస్తున్నాయి. ప్రస్తుతం సంస్థ ఖజానాలో రూ.470 కోట్లు, 430 కిలోల బంగారం, 6 వేల కిలోల వెండి ఉంది.