రాత్రి ఏడు గంటలకు ఆ గ్రామంలో సైరన్ మోగుతుంది. వెంటనే ఊళ్లోని టీవీలన్నీ మూగబోతాయి. సెల్ ఫోన్లన్నీ స్విచ్ ఆఫ్ అయిపోతాయి. పిల్లలంతా బుద్ధిగా కూర్చొని, పుస్తకాలు ముందేసుకుని చదువుతారు. గృహిణులు వంట చేయడంపై పూర్తిస్థాయిలో దృష్టి కేంద్రీకరిస్తారు. ఎనిమిదిన్నర గంటల వరకు ఇంతే. ఊరంతా మౌనంగా, ప్రశాంతంగా ఉంటుంది. మహారాష్ట్ర సంగ్లీ జిల్లా కాడేగావ్ మండలం మోహితే వడ్గావ్ గ్రామంలో కనిపించే దృశ్యమిది. ఏదో ఒక రోజో, రెండు రోజులో కాదు. ఆగస్టు 15 నుంచి నిత్యం ఇలాంటి వాతావరణమే కనిపిస్తోంది ఆ గ్రామంలో. దీని వెనుక పెద్ద కథే ఉంది.
స్మార్ట్ లోకంలో సమయం వృథా అని..
మోహితే వడ్గావ్ జనాభా 3,105. దాదాపు అన్నీ రైతు కుటుంబాలే. చెరకు ఎక్కువగా సాగు చేస్తారు. నీరు పుష్కలంగా ఉండడం వల్ల వ్యవసాయంపై ఆదాయమూ బాగానే ఉంటుందట. అందుకే ఎక్కువ మంది తమ పిల్లలను ప్రైవేటు పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియంలో చేర్చారు. కరోనా లాక్డౌన్ సమయంలో ఆన్లైన్ క్లాసులు వినేందుకు విద్యార్థులకు స్మార్ట్ ఫోన్లు కొనిచ్చారు. అయితే.. అదే ఇబ్బందులు తెచ్చిపెట్టింది. పిల్లలంతా గంటల తరబడి మొబైల్స్తోనే కాలం గడపడం ప్రారంభించారు. ఇంటికొచ్చాక పుస్తకం తీయడం దాదాపు మానేశారు. సాయంత్రం టీవీ సీరియల్స్ చూస్తూ మహిళలు బిజీ అయిపోయారు. పిల్లల చదువు గురించి పట్టించుకునేవారు అరుదు అయ్యారు.