Maharashtra Training Aircraft Crash :మహారాష్ట్ర పుణె జిల్లా బారామతి తాలూకా పరిధిలోని గోజుబావి గ్రామ సమీపంలో ఓ ప్రైవేట్ ఏవియేషన్ అకాడమీకి చెందిన శిక్షణ విమానం కూలిపోయింది. ఈ ప్రమాదంలో ట్రైనీ పైలట్‌తో పాటు శిక్షకుడు గాయపడ్డారని పోలీసులు తెలిపారు. రెడ్‌బర్డ్ ఫ్లైట్ ట్రైనింగ్ అకాడమీకి చెందిన శిక్షణ విమానం కూలిపోయిందని.. ఈ ఘటనలో ఇద్దరు గాయపడ్డారని.. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించామని బారామతి ఇన్‌స్పెక్టర్ ప్రభాకర్ మోరే వెల్లడించారు. అయితే ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియలేదని, ఘటనపై విచారణ జరుపుతున్నామని ఆయన తెలిపారు.
నాలుగు రోజుల్లో రెండో ఘటన..
ఇదిలాఉంటే ఈనెల 19వ తేదీన కూడా మహారాష్ట్రలో ఇదే తరహా ఘటన జరిగింది. బారామతిలోని కఫ్తాల్ గ్రామంలో శిక్షణ విమానం కూలి పైలట్ గాయపడ్డాడు. కాగా, నాలుగు రోజుల వ్యవధిలో ప్రైవేట్ ఏవియేషన్ అకాడమీకి చెందిన విమానం కూలడం ఇది రెండోసారి కావడం గమనార్హం. అయితే గత కొద్దిరోజులుగా బారామతి, ఇందాపుర్‌లో తరచూ ఇలా ట్రైనింగ్ ఎయిర్‌క్రాఫ్ట్‌లు కూలడం భయాందోళన కలిగిస్తోందని సమీప ప్రాంత ప్రజలు అంటున్నారు. అందువల్ల ఈ విషయంలో అధికారులు తక్షణమే సరైన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
"రెడ్‌బర్డ్ ఫ్లైట్ ట్రైనింగ్ అకాడమీకి చెందిన ఓ శిక్షణా విమానం ఈరోజు ఉదయం 8 గంటల ప్రాంతంలో కూలిపోయింది. నీరా నది వంతెన కింద విమానం ల్యాండ్ అవుతున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు గాయపడ్డారు. వీరిలో పైలట్‌తో పాటు శిక్షకుడు ఉన్నారు. పైలట్‌కు స్వల్ప గాయలయ్యాయి. గాయపడ్డవారిని దగ్గర్లోని ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నాము. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ఘటనపై విచారణ జరుపుతాం."
-ప్రభాకర్ మోరే, బారామతి ఇన్‌స్పెక్టర్