2020గానూ.. వివిధ కేసుల్లో ప్రజలకు న్యాయాన్ని అందించే రాష్ట్రాల్లో మొదటి స్థానంలో నిలిచింది మహారాష్ట్ర. తమిళనాడు, తెలంగాణ, పంజాబ్, కేరళలు తర్వాతి స్థానాల్లో నిలిచాయని టాటా ట్రస్ట్ నివేదిక వెల్లడించింది. ఈ విషయంలో.. జనాభా పరంగా చిన్న రాష్ట్రాల్లో త్రిపుర ముందంజలో నిలవగా.. సిక్కిం, గోవాలు తర్వాతి స్థానాల్లో నిలిచాయి.
ప్రభుత్వ ముఖ్య విభాగాలైన పోలీసు, న్యాయ, జైళ్ల శాఖకు సంబంధించి బహిరంగంగా అందుబాటులో ఉన్న డేటా ఆధారంగా.. ఈ 'ఇండియా జస్టిస్ రిపోర్ట్' రెండో ఎడిషన్ను రూపొందించారు.
సామాజిక న్యాయ కేంద్రం, కామన్ కాజ్, కామన్వెల్త్ మానవ హక్కుల సంఘం, దక్ష్, 'హౌ ఇండియా లివ్స్' వంటి సంస్థల సహకారంతో 'టాటా ట్రస్ట్' ఈ నివేదికను రూపొందించింది. పౌరులకు న్యాయం అందించే విషయంలో రాష్ట్రాల సామర్థ్యాన్ని అంచనా వేసేందుకు ఈ నివేదిక ఉపయోగపడుతుంది.
మహిళా న్యాయమూర్తులు..
హైకోర్టుల్లో మహిళా న్యాయమూర్తుల వాటా 11శాతం నుంచి 13శాతానికి స్వల్పంగా పెరిగిందని, కింది కోర్టుల్లో మహిళల ప్రాధాన్యం 28శాతం నుంచి 30శాతానికి పెరిగిందని నివేదిక పేర్కొంది. అయితే మొత్తంగా దేశంలో వివిధ న్యాయస్థానాల్లో 29శాతం మహిళా న్యాయమూర్తులు మాత్రమే ఉన్నారని నివేదిక తేల్చింది.
పెండింగ్ కేసుల ముప్పు..
భారత న్యాయస్థానాల్లో పెండింగ్ కేసుల సంఖ్య పెరిగిపోయిందని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఎంబీ. లోకూర్ ఆందోళన వ్యక్తం చేశారు. రిపోర్టులో 'ముందుమాట' రాసిన జస్టిస్ లోకూర్.. నేషనల్ జ్యుడిషియల్ డేటా గ్రిడ్ సమాచారాన్ని ఉటంకించారు. జిల్లా కోర్టుల్లో 35.34మిలియన్లకు పైగా కేసులు పెండింగ్లో ఉన్నాయని.. హైకోర్టులన్నింటిలో కలిపి మరో 4.74 మిలియన్ల కేసులు అపరిష్కృతంగా ఉన్నాయన్నారు. కరోనా నేపథ్యంలో న్యాయస్థానాల పనితీరుతో మానవ హక్కులు, పౌర స్వేచ్ఛ వంటి వాటికి తీవ్ర ముప్పు ఏర్పడిందన్న జస్టిస్ లోకూర్.. న్యాయ సంస్కరణలను యుద్ధ ప్రాతిపదికన అమలు చేయాలన్నారు.
ఇదీ చదవండి:'చెయ్యి పట్టుకుని.. జిప్ విప్పితే లైంగిక దాడి కాదు'