"ప్రతిరోజూ మధ్యాహ్నం చేతి మీద కూర్చుంటుంది. పెద్దపెద్దగా అరుస్తుంది. చేతిమీద కూర్చోబెట్టుకున్నాకే శాంతిస్తుంది."
- ఈస్టర్ డైమండ్ గ్రేస్, కుకూస్ సంరక్షకుడు
ముంబయిలోని గ్రేస్ కుటుంబం ఓ కాకిని పెంచుకుంటోంది. వీళ్ల కుటుంబంలో ఒకరిగా కలిసిపోయిందా కాకి. గ్రేస్ కుటుంబసభ్యులు ఈ కాకిని పెంచుకోవడం వెనక ఓ ఆసక్తికరమైన కథ ఉంది.
"రెండున్నరేళ్ల క్రితం మా ఇంటి బాల్కనీలో ఈ కాకి మాకు దొరికింది. గాయపడి, అనారోగ్యంతో ఉంది. చికిత్స చేసి, వదిలిపెట్టాం. కానీ మరుసటిరోజు మళ్లీ వచ్చింది. మళ్లీ వదిలిపెట్టాం. అయినా తిరిగొచ్చేసింది. ఇక అప్పటినుంచీ ఎటూ వెళ్లలేదు."
- ఈస్టర్ డైమండ్ గ్రేస్, కుకూస్ సంరక్షకుడు
ఆ ఆప్యాయత మరవలేక..
ఈ కుటుంబం చేసిన సాయం, వాళ్లు చూపించిన ఆప్యాయత మరచిపోలేక.. వారితోనే కలిసి జీవిస్తోందీ కాకి. ఆ ఇంట్లోని వారందరికీ పెంచుకుంటున్న కాకి అంటే మహా ఇష్టం. ప్రేమతో దానికి కుకూ అని పేరుపెట్టి.. ఇంట్లో ఒకదానిలా చూసుకుంటున్నారు.
"దాన్ని కుకూ, చుకూ, చుచూ, షనూ బాబా అని పిలుస్తాను. యేదూ బాబా అని పిలిస్తే.. ఏదో భిన్నమైన పేరుతో పిలిచానని వెంటనే గుర్తుపట్టేస్తుంది."