తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కేసుల పెరుగుదలపై అప్రమత్తం..'మహా'లో ఆంక్షలు - మహారాష్ట్రలో కర్ఫ్యూ

దేశవ్యాప్తంగా కొద్ది రోజులుగా కరోనా కేసుల్లో పెరుగుదల కనిపిస్తున్న వేళ.. మహమ్మారి కట్టడికి కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్రం సూచించింది. అటు మహారాష్ట్రలో కరోనా కట్టడికి నేటి నుంచి వివిధ జిల్లాల్లో కఠిన నిబంధనలు అమల్లోకి తెస్తోంది.

Corona virus
కేసుల పెరుగుదలపై కేంద్రం అప్రమత్తం

By

Published : Feb 22, 2021, 5:24 AM IST

Updated : Feb 22, 2021, 7:06 AM IST

దేశవ్యాప్తంగా ఇటీవల కొద్దిరోజుల నుంచి ఆరు రాష్ట్రాల్లో ఒక్కసారిగా కేసుల సంఖ్య పెరిగి పోతున్నాయి. ఈ క్రమంలో కరోనా రెండో వేవ్ వస్తుందన్న ఆందోళనల మధ్య రోగులను గుర్తించడం సహా ఆర్​టీపీసీఆర్​ పరీక్షలు, వ్యాక్సినేషన్ ప్రక్రియ ముమ్మరం చేయాలని పేర్కొంటూ రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్ర ఆరోగ్యశాఖ లేఖలు రాసింది.

నిపుణుల ఆందోళన..

అటు నిపుణులు కూడా కరోనా వేరియంట్లు వెలుగుచూస్తున్న వేళ సామూహిక నిరోధకత సాధించడం కూడా క్లిష్టమవుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రజలు ఏ మాత్రం అలసత్వం వహించకుండా దేశంలో ఒక్క కేసు కూడా లేకుండా పోయే వరకు జాగ్రత్త వహించాలని సూచిస్తున్నారు.

ఆరు రాష్ట్రాల్లోనే..

దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య ఆదివారం ఉదయానికి 1,45,634కి పెరగ్గా అందులో 74 శాతం కేసులు కేరళ, మహారాష్ట్రలోనే ఉన్నాయి. ఛత్తీస్‌గడ్‌, మధ్యప్రదేశ్‌, పంజాబ్‌తో పాటు జమ్ముకశ్మీర్‌లో రోజువారీ కేసుల సంఖ్యలో పెరుగుదల నమోదవుతోంది. మొత్తంగా ఈ 6 రాష్ట్రాల్లో 85.61 శాతం కొత్త కేసులుండగా వారంలో వాటి పెరుగుదల రేటు 1.79 శాతంగా ఉందని కేంద్రం తెలిపింది.

'మహా'లో మళ్లీ ఆంక్షలు..

మహారాష్ట్రలో అత్యధికంగా 8.10 శాతం కొత్త కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలో రాష్ట్ర సర్కారు మహమ్మారి కట్టడికి... నేటి నుంచి కఠిన నిబంధనలు అమలు చేస్తోంది. మహారాష్ట్రలోని పుణెలో కరోనా కేసులు భారీగా పెరుగుతుండటం వల్ల రాత్రి 11 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ అమలు చేయాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. నేటి నుంచే.. ఈ నిర్ణయం అమలులోకి రానుండగా ఈ నెల 28 వరకు పాఠశాలలు, కళాశాలలు మూసివేయాలని ఆదేశించింది. అమరావతి జిల్లాలో.. వారంరోజుల పాటు పూర్తి లాక్ డౌన్ విధించిన ఉద్ధవ్ సర్కారు.. ఇవాళ రాత్రి నుంచి మార్చి 1 వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయని వెల్లడించింది. నేటి నుంచి అన్ని రాజకీయ, మతపరమైన ర్యాలీలతో పాటు.. ప్రజలు గుమికూడే కార్యక్రమాలపై నిషేధం అమల్లో ఉంటుంది.

ఇదీ చూడండి:'మహా'లో పెరుగుతున్న కేసులు- ప్రభుత్వం కఠిన ఆంక్షలు

Last Updated : Feb 22, 2021, 7:06 AM IST

ABOUT THE AUTHOR

...view details