మహారాష్ట్రకు చెందిన ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు రంజిత్‌సింగ్ డిసలేకు అరుదైన గౌరవం దక్కింది. 'గ్లోబల్ టీచర్స్ ప్రైజ్‌మనీ-2020' వరించింది. ఇందుకు బహుమతిగా రూ.7.38 కోట్ల నగదును అందుకోనున్నారు. పాఠశాలలో విద్యార్థుల హాజరు నూరు శాతం ఉండేలా చేయడమే కాకుండా, పాఠ్యపుస్తకాలకు క్యూఆర్ కోడ్‌ను ప్రవేశ పెట్టి విప్లవాత్మక మార్పునకు శ్రీకారం చుట్టినందుకు గానూ రంజిత్ సింగ్ డిసలేను ఈ బహుమతి లభించింది.
యునెస్కో భాగస్వామ్యంతో వర్కే ఫౌండేషన్ ఏటా ఈ గ్లోబల్ టీచర్స్ ప్రైజ్‌మనీ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఈ ఏడాదికిగాను లండన్‌లోని నేచురల్ హిస్టరీ మ్యూజియంలో ఈ ఎంపిక కార్యక్రమం జరిగింది. ఈ బహుమతి కోసం 140 దేశాల నుంచి మొత్తం 12 వేలకు పైగా నామినేషన్లు వచ్చాయని ఫౌండేషన్ ప్రతినిధులు తెలిపారు. ఈ అవార్డు తుది జాబితాకు మొత్తం 10మందిని ఎంపిక చేయగా... వారందరిలో రంజిత్ సింగ్ డిసలే విజేతగా నిలిచాడని ప్రకటించారు.
వారికి సగం డబ్బులు..
తనకు అందిన ఈ బహుమతిలో సగం డబ్బులను తనతో పాటు తుది జాబితాలో నిలిచిన మిగతా తొమ్మిది మంది ఉపాధ్యాయులకు అందిస్తానని తెలిపారు రంజిత్ సింగ్ డిసలే.