మహారాష్ట్రలో కరోనా తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. తాజాగా.. 43వేల 183 మందికి వైరస్ సోకింది. 249 మంది మరణించారు. కరోనా వ్యాప్తి తర్వాత రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన కేసుల్లో ఇవే అత్యధికం.
ఆ రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 28లక్షల 56 వేల 163కి చేరింది. వైరస్ మృతుల సంఖ్య 54వేల 898కి పెరిగింది. కొవిడ్ సోకిన వారిలో మరో 32,641 మంది కోలుకోగా.. రికవరీల సంఖ్య 24.33 లక్షలకు పెరిగింది. 3.66లక్షల యాక్టివ్ కేసులున్నాయి.
ఒక రోగి నుంచి 400 మందికి వైరస్..
ఒక కరోనా రోగి నుంచి 400మందికి వైరస్ సోకుతోందని మహారాష్ట్ర కొవిడ్ టాస్క్‌పోర్స్ వైద్యుడు డాక్టర్ సంజయ్ ఓక్ వెల్లడించారు. కరోనా నిబంధనలు పాటించడం తప్ప వేరే మార్గం లేదని స్పష్టం చేశారు.
కర్ణాటకలో 10 లక్షలు దాటిన కేసులు
కర్ణాటకలో తాజాగా నమోదైన 4,234 కరోనా కేసులతో మొత్తం బాధితుల సంఖ్య 10 లక్షల మార్కును దాటింది. మరో 18 వైరస్‌కు బలవగా.. మరణాల సంఖ్య 12,585కు చేరింది.
లాక్డౌన్ విధించొద్దని ఆ సంస్థల విజ్ఞప్తి
మహారాష్ట్రలో విపరీతంగా కరోనా కేసులు పెరుగుతుంటే.. రాష్ట్రంలో లాక్డౌన్ విధించవద్దని కోరుతున్నాయి సినిమా, రిటైల్, షాపింగ్ పరిశ్రమల అసోసియేషన్లు. గతేడాదిలో లాక్డౌన్ విధిస్తే తమ వ్యాపారాలు పూర్తిగా దెబ్బతింటాయని.. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న తాము మళ్లీ ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతామని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ఠాక్రేకు విజ్ఞప్తి చేశాయి. తాము అన్ని కరోనా నిబంధనలను అనుసరిస్తున్నామని తెలిపాయి.
ఇదీ చూడండి:'రీ-ఇన్‌ఫెక్షన్'కు శాస్త్రవేత్తల నిర్వచనం ఇదే