ముఖ్యమంత్రి పదవి కోసం తాను పోరాటం చేయబోనని మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే పేర్కొన్నారు. ఒక్క ఎమ్మెల్యే వద్దన్నా రాజీనామా చేస్తానని వెల్లడించారు. కొంతమంది శివసేన ఎమ్మెల్యేలతో కలిసి ఆ పార్టీ మంత్రి ఏక్నాథ్ శిందే తిరుగుబాటు చేసిన నేపథ్యంలో మహారాష్ట్ర ప్రజలనుద్దేశించి ఫేస్బుక్ ద్వారా ప్రసంగించారు. శివసేన ఎప్పుడూ హిందుత్వాన్ని వదిలిపెట్టలేదని అన్నారు ఠాక్రే. హిందుత్వం తమ గుర్తింపు అని చెప్పారు. ఈ సందర్భంగా ఏక్‌నాథ్‌కు పరోక్షంగా చురకలు అంటించారు ఠాక్రే. కొందరు ప్రేమతో గెలుస్తారు, ఇంకొందరు కుట్రలతో గెలుస్తారని వ్యాఖ్యానించారు.
'పదవి కోసం వెంపర్లాడను.. రాజీనామా లేఖ సిద్ధంగా ఉంది' - ఉద్ధవ్ ఠాక్రే ట్విట్టర్
Uddhav Thackeray FB live: ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తానని మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే అన్నారు. పదవులు వస్తుంటాయి, పోతుంటాయని.. వాటి కోసం పోరాటం చేయబోనని పేర్కొన్నారు. తన తర్వాత కూడా శివసేన నాయకుడే సీఎం అయితే బాగుంటుందని వ్యాఖ్యానించారు.
"హిందుత్వ మా గుర్తింపు, మాభావజాలం. కరోనా సమయంలో మా కృషికి గుర్తింపు లభించింది. సీఎం పదవి తీసుకోవాలని శరద్ పవార్ నన్ను కోరారు. ఆయన కోరిక మేరకు సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేశాం. పార్టీని నడిపించే సామర్థ్యం నాకు లేదని శివసైనికులు భావిస్తే.. నేను శివసేన అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తా. సూరత్ నుంచో, మరే ప్రదేశం నుంచో ప్రకటనలు చేయడం ఎందుకు? సీఎం, శివసేన అధ్యక్షుడిగా నేను అసమర్థుడినని నా ముందుకొచ్చి చెప్పండి. వెంటనే రాజీనామా చేస్తా. రాజీనామా లేఖ సిద్ధంగా ఉంచుతా. మీరే రాజ్‌భవన్‌కు తీసుకెళ్లండి. నేను బాల్‌ఠాక్రే కుమారుడిని... పదవికి కోసం వెంపర్లాడను. పదవులు వస్తుంటాయి పోతుంటాయి. అనుకోకుండా నాకు సీఎం పదవి దక్కింది. నాకు ముఖ్యమంత్రిగా కొనసాగాలని లేదు. ఒక్క ఎమ్మెల్యే వద్దన్నా ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తా. నా తర్వాత కూడా శివసేన నేత సీఎం అయితే సంతోషిస్తా."
-ఉద్ధవ్ ఠాక్రే, మహారాష్ట్ర సీఎం, శివసేన అధినేత