Maharashtra Political Crisis : పార్టీలో సంక్షోభం ఏర్పడిన నేపథ్యంలో ఎన్సీపీ అధినేత శరద్ పవార్ తన వ్యూహాలకు పదును పెట్టారు. ఎన్సీపీలో చీలిక తెచ్చిన అజిత్ పవార్ వైపు ఆకర్షితులు కాకుండా శాసనసభ్యులను శరద్ పవార్ తనవైపు తిప్పుకుంటున్నారు. ఆదివారం అజిత్ పవార్ ప్రమాణ స్వీకారానికిహాజరైన ఇద్దరు ఎమ్మెల్యేలు తిరిగి శరద్ పవార్ చెంతకు చేరారు. సోమవారం ఆయన కారులో వీరిద్దరు ప్రత్యక్షమయ్యారు. మకరంద్ పాటిల్, బాలాసాహెబ్ పాటిల్ అనే ఇద్దరు ఎమ్మెల్యేలు తిరిగి శరద్ పవార్ గూటికి వచ్చారు. షిరూర్ ఎంపీ అమోల్ కోల్హే సైతం తాను శరద్ పవార్ వెంటే ఉంటానని ప్రకటించారు. మకరంద్ పాటిల్.. సతారా జిల్లాలోని వాయీ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తుండగా.. బాలాసాహెబ్ పాటిల్ నార్త్ కరాడ్ ఎమ్మెల్యేగా ఉన్నారు.
సోమవారం గురు పూర్ణిమ సందర్భంగా తన గురువు, మహారాష్ట్ర మొదటి ముఖ్యమంత్రియశ్వంతరావు చవాన్ స్మారక చిహ్నానికి నివాళులు అర్పించేందుకు శరద్ పవార్ వెళ్లగా.. ఆయనతో పాటు ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా పయనమయ్యారు. వీరిని తిరిగి తీసుకురావడంలో శరద్ పవార్ రాత్రికే రాత్రే వ్యూహాలు రచించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం మహారాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఇది చర్చనీయాంశంగా మారింది.
వాయీ నియోజకవర్గం ఎన్సీపీకి మంచి పట్టున్న స్థానం. ఈ స్థానం నుంచి ఎన్సీపీ అభ్యర్థులు చాలా సార్లు ఎన్నికయ్యారు. మకరంద్ పాటిల్ తాత దివంగత లక్ష్మణ్ పాటిల్, శరద్ పవార్లు మంచి మిత్రులుగా ఉండేవారు. లక్ష్మణ్‌రావు పాటిల్ సతారా జిల్లా ఎన్సీపీ అధ్యక్షుడిగానూ పనిచేశారు. ఆయన ఎంపీగానూ.. వాయీ నియోజకవర్గం నుంచి మూడు సార్లు ఎమ్మెల్యేగానూ ఎన్నికయ్యారు.