Maharashtra Political Crisis : మహారాష్ట్ర ఎన్సీపీలో చీలిక నేపథ్యంలో ఇరువర్గాలు బలప్రదర్శన చేశాయి. శరద్ పవార్, అజిత్ పవార్ వర్గాలు.. బుధవారం వేర్వేరుగా సమావేశమయ్యాయి. పార్టీ ఇరువర్గాల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలతో.. ప్రత్యేక సమావేశాలు నిర్వహించాయి. శరద్ పవార్ నేతృత్వంలో వైబీ చవాన్ సెంటర్‌లో సమావేశం జరిగింది. మరోవైపు, అజిత్ పవార్ సైతం ఎమ్మెల్యేలు, ఎంపీలతో బాంద్రాలో ఉన్న ముంబయి ఎడ్యుకేషన్ ట్రస్ట్ (ఎంఈటీ) భవనంలో సమావేశం నిర్వహించారు.
పోటాపోటీగా నిర్వహించిన ఈ సమావేశాల్లో ఆయా వర్గాలకు చెందిన కార్యకర్తలు సందడి చేశారు. పోటాపోటీగా తమ నేతలకు అనుకూలంగా నినాదాలు చేశారు. సమావేశం జరిగిన ఎంఈటీ భవనం వద్ద అజిత్‌కు మద్దతుగా పెద్ద ఎత్తున బ్యానర్లు, పోస్టర్లు ఏర్పాటు చేశారు. ఇదే సమయంలో ముంబయి దేవగిరిలోని ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్ నివాసానికి పెద్ద సంఖ్యలో మద్దతుదారులు చేరుకుని.. ఆయనకు అనుకూల నినాదాలు చేశారు.
అజిత్ పవార్ సమావేశానికి 35 మంది ఎమ్మెల్యేలు, ఐదుగురు ఎమ్మెల్సీలు వచ్చినట్లు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. సమావేశాల్లో భాగంగా అజిత్ పవార్ వర్గం.. తమ మద్దతుదారుల నుంచి అఫిడవిట్లు సేకరించింది. అజిత్ పవార్‌కు చెందిన ఎన్సీపీకే విధేయులుగా ఉంటామని కార్యకర్తల నుంచి హామీ తీసుకుంది. పార్టీలోని నేతలందరి మద్దతు తమకే ఉందని అజిత్ వర్గం నేత ప్రఫుల్ పటేల్ పేర్కొన్నారు. దీనిపై తమకు ఎలాంటి ఆందోళన లేదని చెప్పారు. సమావేశానికి ముందు ఎంఈటీ భవనం వద్ద ఎన్సీపీ జెండాను ఆవిష్కరించారు అజిత్ పవార్.
అంతకుముందు, పార్టీ ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులంతా సమావేశానికి తప్పక హాజరుకావాలని ఎన్సీపీ రెండు వర్గాల నోటీసులు జారీ అయ్యాయి. సమావేశానికి హాజరు కాని ఎమ్మెల్యేలపై కఠిన చర్యలు తీసుకుంటామని శరద్ పవార్ వర్గం నేత జితేంద్ర అవహద్ విప్ జారీ చేశారు. అయితే, ఎన్సీపీ రాష్ట్ర అధ్యక్షుడు జయంత్ పాటిల్, జితేంద్ర అవహద్ల శాసనసభ సభ్యత్వం రద్దు చేయాలని అజిత్ వర్గం స్పీకర్‌ను కోరింది.