మహా వికాస్ అఘాడీ(ఎంవీఏ) సర్కారులో ప్రధాన భాగస్వామి శివసేన పార్టీలో తలెత్తిన అంతర్గత సంక్షోభం ఇప్పట్లో సమసిపోయే పరిస్థితి కనిపించడంలేదు. తిరుగుబాటు వర్గం నేత, రాష్ట్ర మంత్రి ఏక్నాథ్ శిందే తన బలాన్ని రోజు రోజుకూ పెంచుకుంటుండగా...మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేకు మద్దతిచ్చే ఎమ్మెల్యేల సంఖ్య క్రమంగా తగ్గిపోతోంది. రాజీ యత్నాల్లో భాగంగా శివసేన అధికార ప్రతినిధి సంజయ్ రౌత్ చేసిన ప్రతిపాదనకు శిందే వర్గం స్పందించక పోగా...వేచి చూసే ధోరణినే కొనసాగిస్తోంది. తన మద్దతుదారుల్లోని 12 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసే ప్రయత్నాలపై శిందే ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలైన శివసేన తమదేనని, పార్టీ ఎమ్మెల్యేల్లో అత్యధికులు తన వెంటే ఉన్నారని, అనర్హత పేరుతో భయపెట్టలేరని మండిపడ్డారు. తామే ప్రత్యర్థి వర్గంపై చర్యలు తీసుకుంటామన్నారు. అసమ్మతి ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా శివసేన కార్యకర్తలు నిరసనలకు దిగుతున్న నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు రెడ్ అలర్ట్ ప్రకటించారు. ముంబయిలో గట్టి బందోబస్తు చర్యలు చేపట్టారు. గువాహటి శిబిరంలో ఉన్న ఎమ్మెల్యేల సంఖ్య 50కి చేరుకున్నట్లు సమాచారం. వారిలో 40 మంది శివసేనకు చెందిన వారేనని అసమ్మతి వర్గ నేత శిందే ఓ వార్త సంస్థకు స్వయంగా వెల్లడించారు.
సభలో నెగ్గుతాం: సంజయ్ రౌత్
ఏక్నాథ్ శిందే తిరుగుబాటుతో తమకు మద్దతిచ్చే పార్టీ ఎమ్మెల్యేల సంఖ్య తగ్గిపోతోందని శివసేన అధికార ప్రతినిధి సంజయ్ రౌత్ శుక్రవారం విలేకరుల సమావేశంలో అంగీకరించారు. అయితే, శాసనసభలో జరిగే బల పరీక్షలో కూటమి ప్రభుత్వానికి అనుకూలంగానే రెబల్స్ ఓటేస్తారనే విశ్వాసం వ్యక్తం చేశారు. ముంబయికి తిరిగి వచ్చిన తర్వాత పార్టీ విధేయతకు సంబంధించిన నిజమైన పరీక్షను వారు ఎదుర్కొంటారన్నారు.
మా వెనుకుంది బాల్‌ఠాక్రేనే: శిందే
బలమైన జాతీయ పార్టీ మద్దతిస్తోందని గురువారం గువాహటిలో తన వర్గం ఎమ్మెల్యేలకు తెలిపిన తిరుగుబాటు నేత ఏక్నాథ్ శిందే శుక్రవారం మాట మార్చారు. ఏ జాతీయ పార్టీ తమను సంప్రదించలేదని తెలిపారు. భాజపా అండగా నిలుస్తోందా అని ఓ టీవీ ఛానెల్ విలేకరి ప్రశ్నించగా ..‘ఒక పెద్ద శక్తి మా వెనుకుంది అంటే...అది బాలా సాహెబ్ ఠాక్రే, ఆనంద్ డిఘేనే’ అని సమాధానమిచ్చారు. మహారాష్ట్ర రాజకీయ సంక్షోభం ముగింపునకు సంబంధించి మాట్లాడుతూ...స్పష్టత రావడానికి ఇంకా కొంత సమయం పట్టవచ్చని తెలిపారు. ‘55 మంది శివసేన ఎమ్మెల్యేల్లో 40 మంది నా వెంట గువాహటికి వచ్చారు. ప్రజాస్వామ్యంలో మెజారిటీ, సంఖ్యా బలమే ముఖ్యం. మాపై చర్యలు తీసుకునే అధికారం ఎవరికీ లేదు’ అని..డిప్యూటీ స్పీకర్ నరహరి జిర్వాల్‌కు శివసేన చీఫ్‌విప్ రాసిన లేఖపై స్పందించారు. గురువారం ముంబయిలో శిందే కార్యాలయం విడుదల చేసిన వీడియోలో..‘మనం చరిత్రాత్మకమైన నిర్ణయం తీసుకున్నామని ఓ జాతీయ పార్టీ ప్రశంసించింది. మీ వెంటే మేం ఉన్నామని తెలిపింద’ని ఏక్నాథ్ గువాహటి హోటల్లో తన మద్దతుదారులతో చెబుతున్నట్లుగా ఉంది.
వీడింది అధికార నివాసాన్నే.. ధైర్యాన్ని కాదు:ఠాక్రే
పార్టీ ఎమ్మెల్యేలపై పట్టు కోల్పోయానని స్పష్టమైన పరిస్థితుల్లో...క్షేత్ర స్థాయిలో శ్రేణుల మద్దతును కూడగట్టే ప్రయత్నాలను శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే ప్రారంభించారు. దాదర్‌లోని శివసేన భవన్లో సమావేశమైన పార్టీ జిల్లా అధ్యక్షులు, నియోజకవర్గాల ఇన్‌ఛార్జులతో వర్చువల్ విధానంలో శుక్రవారం ఆయన మాట్లాడారు. తన నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం మనుగడ సాగించగలదనే భరోసా కల్పించే యత్నం చేశారు.