Ajit Pawar Joins NDA : ఎన్‌సీపీ కీలక నేత అజిత్ పవార్ డిప్యూటీ సీఎంగా ప్రమాణం చేయడంపై ఆ పార్టీ అధికార ప్రతినిధి మహేశ్ భరత్ తపసే స్పందించారు. ఎన్‌సీపీ నాయకులు చాలా మంది శరద్ పవార్తోనే ఉన్నారని ఆయన చెప్పారు. రాజ్భవన్లో ఎన్‌సీపీ నాయకులు చేసిన ప్రమాణ స్వీకారాన్ని తాము గుర్తించమని అన్నారు.
బీజేపీకి కర్ణాటక ఫలితాలే 'మహా'లో కూడా రిపీట్'
మరోవైపు ఇప్పటకిప్పుడు మహారాష్ట్రలో ఎన్నికలు జరిగితే.. బీజేపీకి కర్ణాటక ఫలితాలు వస్తాయని కాంగ్రెస్ అధికార ప్రతినిధి సచిన్ సావంత్ అన్నారు. మహారాష్ట్రలో గెలవాలంటే ఎన్‌సీపీని చీల్చడం తప్ప బీజేపీకి వేరే మార్గం లేదని విమర్శించారు. ఎన్‌సీపీని.. బీజేపీ చీలుస్తుందని తమకు ఎప్పుడో తెలుసని చెప్పారు. బీజేపీ అసలు రంగు ఇప్పుడు బయటపడిందని సావంత్ విమర్శించారు.
'సర్కస్ ఎక్కువ కాలం ఉండదు'
మహారాష్ట్ర రాజకీయ పరిణామాలపై శివసేన(యూబీటీ) వర్గం నాయకుడు సంజయ్ రౌత్ స్పందించారు. ఎన్‌సీపీ చీలికతో ఆ పార్టీ అధినేత శరద్ పవార్ అధైర్యపడలేదని చెప్పారు. ఎన్డీఏలో అజిత్ పవార్ చేరడంపై స్పందిస్తూ.. ఈ సర్కస్ ఎక్కువ కాలం ఉండదని ఎద్దేవా చేశారు.