Maharashtra Political Crisis : ఎన్సీపీ తిరుగుబాటు నేత అజిత్ పవార్ బీజేపీ-శివసేన ప్రభుత్వంలో చేరడం వల్ల.. శరద్ పవార్ వర్గం తీవ్ర ఆలోచనలో పడింది. పార్టీపై పట్టునిలుపుకునేందుకు తీవ్రంగా యత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మహా వికాస్ అఘాడి-ఎంవీఏ మరోసారి ఏకం కానున్నట్లు తెలుస్తోంది. రాబోయే రోజుల్లో శివసేన-భాజపా సంకీర్ణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మహారాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టాలని నిర్ణయించింది.
MVA Maharashtra Crisis : అజిత్ పవార్ తిరుగుబాటు నేపథ్యంలో.. మహారాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు నానాపటోల్, కార్యనిర్వాహక అధ్యక్షుడు నసీం ఖాన్.. ఎన్సీపీ అధినేత శరద్ పవార్‌ను కలిసి సంఘీభావం తెలిపారు. భాజపా-శివసేన ప్రభుత్వాన్ని ఎదుర్కొనేందుకు ఎంవీఏతో కలిసి కాంగ్రెస్ పనిచేయనున్నట్లు తెలిపారు. ఆ విషయంలో శరద్ పవార్ మార్గనిర్దేశం చేస్తారని చెప్పారు. ఎన్సీపీలో తిరుగుబాటుకు బీజేపీ కారణమని ఆరోపించిన కాంగ్రెస్ నేతలు.. దాన్ని ఖండిస్తున్నట్లు చెప్పారు. మాతోశ్రీలో సమావేశమైన ఉద్ధవ్ ఠాక్రే వర్గం.. మహా వికాస్ అఘాడీలో కొనసాగాలా లేదా అనే అంశంపై చర్చించినట్లు తెలుస్తోంది. ఉద్ధవ్ ఠాక్రే ఈ మేరకు పార్టీ నేతల అభిప్రాయం కోరినట్లు సమచారం. ఎంవీఏలో కొనసాగాలనే అభిప్రాయం వ్యక్తమైనట్లు ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి.
మరోవైపు, కేబినెట్ సమావేశం అనంతరం మాట్లాడిన ఉప ముఖ్యమంత్రి, ఎన్సీపీ తిరుగుబాటు నేత అజిత్ పవార్.. తానేం కొత్త వ్యక్తులతో పనిచేయట్లేదని పేర్కొన్నారు. సీఎం శిందే, బీజేపీకి చెందిన కొందరు మంత్రులతో గతంలో కలిసి పనిచేసినట్లు చెప్పారు. ప్రభుత్వ కార్యకలాపాలు సవ్యంగా సాగుతున్నయని చెప్పిన అజిత్ పవార్.. మెజారిటీ ఎన్సీపీ ఎమ్మెల్యేల మద్దతు తనకే ఉన్నట్లు పునరుద్ఘాటించారు.