రుతుస్రావం సమయంలో మహిళలు పడే బాధ అంతా ఇంతా కాదు. పరిశుభ్రం లేని మురికివాడల్లో నివసించే మహిళలు పరిస్థితి ఇంకా దారుణంగా ఉంటుంది. అటువంటి వారి ఇబ్బందులు తగ్గించడానికి పబ్లిక్ టాయిలెట్ వద్ద 'పీరియడ్ రూమ్'ను ఏర్పాటు చేశారు మహారాష్ట్ర థానే మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు. పరిశుభ్రమైన పారిశుధ్య సౌకర్యాలు కల్పించే ప్రయత్నంలో భాగంగా ఓ ఎన్జీవో సహకారంతో శాంతినగర్ ప్రాంతంలో దీనిని ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
తొలిసారిగా ఏర్పాటు చేసిన ఈ 'పీరియడ్ రూమ్'లో జెట్ స్ప్రే, టాయిలెట్ రోల్, సబ్బు, చెత్తడబ్బా, యూరినల్, నిరంతరం నీటి సౌకర్యాలను కల్పించినట్లు అధికారులు వెల్లడించారు. 'పరిశుభ్రత పాటించాలి' అని గది గోడల మీద రాసినట్లు చెప్పారు. ఈ రూమ్ ఏర్పాటుకు రూ.45వేల ఖర్చు అయినట్లు తెలిపారు.