కొవిడ్ విజృంభణ నేపథ్యంలో ఆసుపత్రుల్లో ఆక్సిజన్ అందక అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఇలాంటి వారి కష్టాలను చూడలేకపోయాడు ముంబయికి చెందిన ఓ యువకుడు. తనకు వీలైనంతలో కొవిడ్ రోగులకు సాయం చేయాలని ముందడుగు వేశాడు. ఇందుకోసం రూ. 22 లక్షలు విలువ చేసే సొంత కారు అమ్మేందుకు వెనకాడలేదు.
మిత్రుడి సోదరి మరణానంతరం..
ఆక్సిజన్ కొరత కారణంగా తన మిత్రుడి సోదరి మరణించడాన్ని చూసి షహ్నవాజ్ షేక్ భావోద్వేగానికి గురయ్యాడు. ఇలాంటి పరిస్థితి ఇతరులకు రాకూడదని.. తన కారును అమ్మి 160 ఆక్సిజన్ సిలిండర్లు కొన్నాడు. అవసరమున్న కొవిడ్ రోగులకు వాటిని ఉచితంగా ఇచ్చాడు. ఈ కార్యక్రమం కొనసాగించేందుకు నిధులు సేకరిస్తూ పలువురుకి ఆదర్శంగా నిలుస్తున్నాడు. ఒక్క ఫోన్ చేస్తే చాలు రోగులకు ఆక్సిజన్ సిలిండర్ సరఫరా చేస్తానని భరోసా ఇస్తున్నాడు. ఇప్పటివరకు షహ్నవాజ్ 5,500 మంది కొవిడ్ రోగుల ప్రాణాలు కాపాడాడు. ఏడాది నుంచి ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తుండటం గమనార్హం.