Income tax raid Jalna : మహారాష్ట్రలో ఓ వ్యాపారి ఇళ్లు, కార్యాలయాలపై ఆదాయ పన్ను శాఖ జరిపిన దాడుల్లో.. కళ్లు చెదిరే ఆస్తులు బయటపడ్డాయి. ఏకంగా రూ.56 కోట్ల నగదు, రూ.14కోట్లు విలువైన బంగారం, వజ్రాభరణాలను ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇతర ఆస్తులకు సంబంధించి ముఖ్యమైన దస్త్రాలు గుర్తించారు.
భారీ స్కామ్.. రూ.56కోట్ల క్యాష్, రూ.14కోట్ల ఆభరణాలు స్వాధీనం.. లెక్కించేందుకు 13 గంటలు! - income tax raid news
భారీగా అక్రమాస్తుల్ని స్వాధీనం చేసుకుంది ఆదాయ పన్ను శాఖ. మహారాష్ట్ర జల్నాలోని ఓ వ్యాపారి ఇళ్లు, కార్యాలయాల్లో 8 రోజులపాటు సోదాలు జరిపి రూ.56 కోట్ల నగదు, రూ.16కోట్లు విలువైన ఆభరణాలు, ఇతర కీలక దస్త్రాలు జప్తు చేసింది.
పన్ను ఎగవేత ఆరోపణలతో.. మహారాష్ట్ర జల్నాలో ఉక్కు, వస్త్ర, స్థిరాస్తి వ్యాపారం చేసే ఓ సంస్థకు సంబంధించిన వారి ఇళ్లు, కార్యాలయాలపై ఆగస్టు 1న ఈ దాడులు ప్రారంభించారు ఐటీ శాఖ అధికారులు. 8వ తేదీ వరకు నిరంతరాయంగా సోదాలు జరిపారు. భారీ మొత్తంలో ఆస్తులు గుర్తించారు. అధికారులు స్వాధీనం చేసుకున్న నగదును యంత్రాల సాయంతో లెక్కించేందుకు 13 గంటలు పట్టింది.
మరో రూ.150 కోట్ల బ్లాక్ మనీ.. రాజస్థాన్ జైపుర్లోనూ భారీగా నల్లదనం పట్టుబడింది. జైపుర్ కేంద్రంగా ఉన్న ఓ గ్రూప్.. జెమ్స్, జువెలరీ, హాస్పిటాలిటీ, రియల్ ఎస్టేట్ వ్యాపారాలు నిర్వహిస్తోంది. ఇటీవల ఆదాయపు పన్ను శాఖ.. ఈ గ్రూప్ ఆఫీస్లపై దాడులు చేయగా.. రూ. 150 కోట్ల మేర లెక్కల్లోకి రాని డబ్బు దొరికింది. ఆగస్టు 3న దాదాపు 35కుపైగా ఆ గ్రూప్ ప్రదేశాల్లో సోదాలు నిర్వహించినట్లు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు(సీబీడీటీ) తెలిపింది. లెక్కల్లో చూపని రూ.11 కోట్ల విలువైన ఆస్తులను కూడా సీజ్ చేసినట్లు పేర్కొంది.