మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలతో జనజీవనం స్తంభించిపోయింది. ఎడతెరపి లేకుండా వాన కురుస్తుండటం వల్ల.. భీవండిలో రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. ఇళ్లన్నీ వరద నీటిలో మునిగిపోయాయి.
డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేక నీరంతా కాలనీలలోనే నిల్వ ఉంటోంది. దీంతో అక్కడి ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. కొందరు ఆ నీటిలో ఈదుకుంటూనే ఇతర ప్రాంతాలకు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు.
వరదలో చిక్కుకుపోయిన ప్రజలను కాపాడేందుకు జాతీయ విపత్తు స్పందన దళం రంగంలోకి దిగింది. ఇళ్లలోని వారిని బయటకు తీసుకొస్తోంది. సహాయ బోట్లను ఉపయోగించి వరద బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తోంది.