మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లాలో పరువు హత్య కలకలం రేపింది. ఓ యువకుడిని ప్రేమిస్తుందనే కారణంతో కన్న కుమార్తెనే చంపాడు ఓ తండ్రి. హత్య విషయం బయట పడకుండా సాక్ష్యాలనూ ధ్వంసం చేశాడు. గ్రామస్థుల ఫిర్యాదుతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. హత్యకు సహకరించిన వారితో పాటు నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు.
ఇదీ జరిగింది..నాందేడ్ జిల్లాలోని పింప్రి మహిపాల్ గ్రామానికి చెందిన 23 ఏళ్ల శుభంగి బీఏఎంఎస్ మూడో సంవత్సరం చదువుతోంది. అదే గ్రామానికి చెందిన తరుణ్ అనే యువకుడితో ఆమెకు ఏర్పడిన పరిచయం కాస్తా ప్రేమగా మారింది. ఈ ప్రేమ వ్యవహారాన్ని శుభంగి తల్లిదండ్రులు వ్యతిరేకించారు. తరుణ్‌ను మర్చిపోవాలని ఆమెను పలు మార్లు మందలించారు. అయినా ఆమెలో మార్పు రాలేదు. దీంతో మూడు నెలల క్రితమే శుభంగికి మరొక యువకుడితో పెళ్లిని నిశ్చయించారు.
పెద్దలు కుదిర్చిన వివాహానికి శుభంగి ఒప్పుకోలేదు. తరుణ్‌నే పెళ్లి చేసుకుంటానని తెగేసి చెప్పింది. దీంతో ఆమెపై కోపం పెంచుకున్నారు తల్లిదండ్రులు. పరువు పోతుందనే కారణంతో శుభంగిని చంపాలని ఇతర కుటుంబ సభ్యులతో కలిసి పథకం పన్నారు. అనుకున్న ప్రకారం ఆదివారం ఇంట్లో ఒంటరిగా ఉన్న శుభంగిని హత్య చేశారు. అనంతరం గ్రామంలోని పొలంలోనే అంత్యక్రియలు పూర్తి చేశారు. సాక్ష్యాలు దొరక్కుండా ఆమె అస్తికలను మరో గ్రామంలోకి తీసుకెళ్లి నీటిలో కలిపారు. ఈ హత్యకు సంబంధించి ఎటువంటి ఆధారాలు లేకుండా జాగ్రత్తపడ్డారు కుటుంబ సభ్యులు.
రోజులు గడుస్తున్నా శుభంగి కనిపించకపోవడం వల్ల గ్రామస్థులుకు అనుమానం వచ్చింది. స్థానిక పోలీస్ స్టేషన్లో సమాచారం ఇచ్చారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు తమదైన శైలిలో విచారణ జరపగా నేరాన్ని అంగీకరించారు నిందితులు. తమ కుటుంబ పరువు తీస్తుందేమోననే కారణంతోనే తమ కూతుర్ని చంపామని ఒప్పుకున్నాడు తండ్రి. ఈ కేసులో ఆమె తండ్రి సహా ఐదుగురిని పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టయిన వారిలో యువతి మేనమామ, మామ, ఇద్దరు బంధువులు ఉన్నారని అసిస్టెంట్ పోలీస్ ఇన్‌స్పెక్టర్ చంద్రకాంత్ పవార్ తెలిపారు.