Maharashtra Governor News: దేశ ఆర్థిక రాజధాని ముంబయి ఆర్థికస్థితిని ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేసి వివాదాలకు తెరలేపిన మహారాష్ట్ర గవర్నర్ సోమవారం క్షమాపణలు చెప్పారు. రాష్ట్ర ప్రజలు తనను క్షమించాలని కోరుతూ ట్విటర్ వేదికగా ఓ ప్రకటన విడుదల చేశారు. గుజరాతీలు, రాజస్థానీలు మహారాష్ట్రను విడిచి వెళ్లితే.. ఈ రాష్ట్రంలో డబ్బేం మిగలదంటూ కోశ్యారీ ఓ కార్యక్రమంలో మాట్లాడిన విషయం తెలిసిందే. 'గుజరాతీలు, రాజస్థానీలు మహరాష్ట్ర నుంచి మరీ ముఖ్యంగా ముంబయి, ఠాణెను విడిచివెళ్లిపోతే.. ఈ రాష్ట్రంలో డబ్బేం మిగలదు. ముంబయి దేశ వాణిజ్య రాజధానిగా ఉండే అర్హత కోల్పోతుంది' అని అన్నారు.
కాగా, గవర్నర్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. పలు పార్టీలు ఆయన వ్యాఖ్యలను ఖండించాయి. దీనిపై ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే తీవ్రంగా స్పందించారు. 'గవర్నర్ హిందువుల మధ్య విభజన తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆయన వ్యాఖ్యలు మరాఠీ ప్రజలను అవమానించడం కిందికే వస్తాయి. ఆయన్ను ఇంటికి వెళ్లగొట్టాలా అన్న అంశంపై అని ప్రభుత్వం నిర్ణయించుకునే సమయం వచ్చింది. కోశ్యారీ కూర్చొన్న స్థానాన్ని గౌరవించడం కోసం ఇంకెంత కాలం మౌనంగా ఉండాలో తెలియట్లేదు. ఈ వ్యాఖ్యలపై వెంటనే క్షమాపణలు చెప్పాలి' అంటూ ఉద్ధవ్ తీవ్రంగా స్పందించారు.