Maharastra Governor News: ముంబయి ఆర్థికస్థితిని ఉద్దేశించి మహారాష్ట్ర గవర్నర్ భగత్‌సింగ్ కోశ్యారీ సంచలన వ్యాఖ్యలు చేశారు. గుజరాతీలు, రాజస్థానీలు మహారాష్ట్రను విడిచి వెళ్లితే.. ఈ రాష్ట్రంలో డబ్బేం మిగలదంటూ ఓ కార్యక్రమంలో మాట్లాడారు. "గుజరాతీలు, రాజస్థానీలు మహరాష్ట్ర నుంచి మరీ ముఖ్యంగా ముంబయి, ఠాణెను విడిచివెళ్లిపోతే.. ఈ రాష్ట్రంలో డబ్బేం మిగలదు. ముంబయి దేశ వాణిజ్య రాజధానిగా ఉండే అర్హత కోల్పోతుంది" అని అన్నారు. వీరు ముంబయిని ఆర్థిక రాజధానిగా మార్చడంలో అందించిన సహకారాన్ని ఆయన కొనియాడినట్లు గవర్నర్ కార్యాలయం ప్రకటన విడుదల చేసింది.
'ఏక్‌నాథ్ శిందే ఆ వ్యాఖ్యలు ఖండించాలి'..
ఈ వ్యాఖ్యలను మహారాష్ట్ర నేతలు తప్పుపట్టారు. ఈ మాటలతో కష్టపడి పనిచేసే మహారాష్ట్ర ప్రజలను అవమానించారంటూ శివసేన నేత సంజయ్ రౌత్ విమర్శించారు. "భాజపా మద్దతు పొందిన ముఖ్యమంత్రి అధికారంలోకి రాగానే, మరాఠీ వ్యక్తి అవమానానికి గురవుతున్నాడు. ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ శిందే ఈ వ్యాఖ్యలను ఖండించాలి" అంటూ ట్వీట్ చేశారు. ఈ వ్యాఖ్యలపై గవర్నర్ వెంటనే క్షమాపణలు చెప్పాలని కాంగ్రెస్, శివసేన నేతలు డిమాండ్ చేశారు.
'రాజస్థానీ, గుజరాతీల సహకారంపై మాత్రమే మాట్లాడాను'..
అయితే ఈ వివాదంపై మహారాష్ట్ర గవర్నర్ భగత్‌సింగ్ కోశ్యారీ తాజాగా స్పందించారు. మరాఠీలను తక్కువ అంచనా వేయాలనే ఉద్దేశం తనకు లేదని అన్నారు. "గుజరాతీ, రాజస్థానీలు అందించిన సహకారంపై మాత్రమే నేను మాట్లాడాను. మరాఠీలు ఎంతో కష్టపడి మహారాష్ట్రను నిర్మించారు. ఎందరో మరాఠీ పారిశ్రామికవేత్తలు ప్రసిద్ధి చెందారు. ముంబయి నగరం మహారాష్ట్రకు గర్వకారణం." అని స్పష్టం చేశారు.