Maharashtra Fire Accident Today : మహారాష్ట్రలోని హ్యాండ్ గ్లవ్స్ కర్మాగారంలో జరిగిన భారీ అగ్ని ప్రమాదంలో ఆరుగురు కార్మికులు సజీవదహనమయ్యారు. వలుజ్‌లోని ఛత్రపతి శంభాజీనగర్‌లో ఆదివారం తెల్లవారుజామున 2.15 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు నాలుగు గంటల సమయం పట్టిందని అధికారులు తెలిపారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం- సన్‌షైన్ ఎంటర్‌ప్రైజెస్ హ్యాండ్ గ్లవ్స్ తయారీ కంపెనీలో సుమారు 25 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. నైట్ షిఫ్ట్ చేస్తున్న 10-15 మంది ఉద్యోగులు నిద్రిస్తున్న సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో మంటలను గమనించిన కొందరు కార్మికులు పరుగులు తీశారు. ఫ్యాక్టరీ పక్కన ఉన్న చెట్టు సహాయంతో బయటకొచ్చేశారు. మంటలు భారీగా ఎగిసిపడడం వల్ల మరికొందరు బయటకురాలేక సజీవదహనమయ్యారు.
సమాచారం అందుుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనాస్థలికి చేరుకున్నారు. నాలుగు గంటలపాటు తీవ్రంగా శ్రమించి మంటలను ఆర్పివేశారు. చనిపోయిన వారి మృతదేహాలను స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి శవపరీక్షల కోసం తరలించారు పోలీసులు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. కర్మాగారం మొత్తం అగ్నికి ఆహుతైందని అధికారులు తెలిపారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలు, మృతుల వివరాలు ఇంకా తెలియరాలేదు.
కొన్నిరోజుల క్రితం, కర్ణాటక-తమిళనాడులో సరిహద్దులో అత్తిబెలె గ్రామంలోని బాణసంచా గోదాంలో అగ్నిప్రమాదం జరిగింది. బాలాజీ క్రాకర్స్‌లో మంటలు చెలరేగడం వల్లల గోదాం మొత్తం దహనమైంది. ప్రమాద సమయంలో గోదాంలో 20 మందికి పైగా కార్మికులు ఉన్నారు. అందులో 14మంది చనిపోయారు. మరో ఆరుగురు ప్రాణలతో బయటపడ్డారు. బాణసంచా లోడ్‌ను లారీ నుంచి గోదాంలోకి దించుతుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ క్రమంలోనే గోదాం సమీపంలో ఉన్న అనేక వాహనాలు సైతం అగ్నికి ఆహుతయ్యాయి.
షాపింగ్ మాల్లో భారీ అగ్నిప్రమాదం- 11 మంది మృతి
యూనివర్సిటీ హాస్టల్లో భారీ అగ్నిప్రమాదం- 14 మంది మృతి