సాగు చట్టాలకు వ్యతిరేకంగా దిల్లీలో రైతుల చేపట్టిన నిరసనలకు మద్దతుగా దేశంలోని వివిధ ప్రాంతాల్లో ర్యాలీలు నిర్వహించారు. ఆల్ ఇండియా కిసాన్ సభ ఆధ్వర్యంలో మహారాష్ట్రలో రైతులు చేపట్టిన భారీ ర్యాలీ ముంబయికి చేరింది. నాసిక్ ప్రారంభమైన ఈ ర్యాలీలో 15వేల మంది ప్రజలు పాల్గొన్నారు. వీరంతా.. ముంబయి ఆజాద్ మైదానంలో సోమవారం అన్నదాతలు నిర్వహించనున్న సభలో పాల్గొననున్నారు. ఎన్సీపీ అధినేత శరద్ పవార్ సహా మహారాష్ట్ర అధికార కూటమి మహా వికాస్ అఘాడీకి చెందిన ప్రముఖ నేతలు ఈ సభలో పాల్గొననున్నట్లు ఆలిండియా కిసాన్ సభ నాయకులు వెల్లడించారు. అటు పంజాబ్లోని లుథియానాలోనూ ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించారు. జనవరి 26న దిల్లీలో రైతులు నిర్వహిస్తున్న ట్రాక్టర్ ర్యాలీలో పాల్గొననున్నట్లు వెల్లడించారు.
భారీ భద్రత నడుమ..
రైతుల సభ సోమవారం జరగనుంది. ఈ నేపథ్యంలో సభాస్థలి అయిన అజాద్ మైదానం వద్ద మహారాష్ట్ర పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. ఇప్పటికే ప్రత్యేక పోలీసులు బలగాలను రంగంలోకి దించిన అధికారులు.. ర్యాలీని డేగ కళ్ల(డ్రోన్)తో పహారా కాస్తున్నారు.