Maharastra Factory Blast Today :మహారాష్ట్రలోని ఓ సోలార్ పరిశ్రమలో భారీ పేలుడు సంభవించి తొమ్మిది మంది దుర్మరణం పాలయ్యారు. నాగ్‌పుర్ జిల్లాలోని బజార్‌గావ్ ప్రాంతంలో ఉదయం 9.30 గంటలకు ఈ భారీ పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి ఆరుగురు మహిళలు సహా తొమ్మిది మంది మరణించినట్లు అధికారులు వెల్లడించారు. మరో ముగ్గురు గాయపడ్డారు. ప్యాకింగ్ చేస్తున్న సమయంలో ప్రమాదం జరిగినట్లు అధికారులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వారి పరిస్థితి విషమంగానే ఉన్నట్లు వెల్లడించారు.
మృతులను యువరాజ్ ఛారోడే, ఓమేశ్వర్ మచ్చిర్కే, మిటా ఉయికే, ఆర్తి సహారే, శ్వేతాలి మర్బటే, పుష్ప మనపురె, భాగ్య శ్రీ లోనారే, రుమితా ఉయికే, మౌసమ్ పాట్లేగా గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ప్రమాదం ధాటికి భవనం పూర్తిగా దెబ్బతిందని అధికారులు చెప్పారు. ఎంత నష్టం జరిగిందనే విషయాన్ని అంచనా వేస్తున్నామని వివరించారు.
మృతుల కుటుంబసభ్యుల ఆందోళన
మరోవైపు మృతదేహాలను ఇంకా అప్పగించకపోవడం వల్ల వారి కుటుంబసభ్యులు, స్థానికులు ఘటనా స్థలానికి సమీపంలోని జాతీయ రహదారిపై ఆందోళన చేపట్టారు. తమను ఫ్యాక్టరీ లోపలకు అనుమతించాలని డిమాండ్ చేశారు. సుమారు 200 మందికి పైగా రోడ్డుపై బైటాయించి నినాదాలు చేశారు. ఉదయం 9.30 గంటలకు మృతిపై సమాచారం ఇచ్చినా, ఇప్పటివరకు మృతదేహాన్ని అప్పగించలేదని ఓ మృతురాలి తండ్రి ఆవేదన వ్యక్తం చేశాడు. అయితే, ఫ్యాక్టరీలో ఇంకా పేలుడు పదార్థాలు ఉన్నాయని, వాటిని తొలగించాక మృతదేహాలను వెలికితీస్తామని పోలీసులు చెప్పారు. ప్రస్తుతం బాంబు నిర్వీర్య దళాలు పేలుడు పదార్థాల తొలగింపు ప్రక్రియను చేపట్టాయని వివరించారు. వీలైనంత త్వరగా మృతదేహాలని అప్పగిస్తామని వారికి నచ్చచెప్పి ఆందోళన విరమింపజేశారు పోలీసులు.