మహారాష్ట్రలోని రాయ్‌గఢ్ బీచ్‌లో మృతదేహాలు కలకలం రేపుతున్నాయి. మూడు రోజుల వ్యవధిలో 8 మృతదేహాలు లభ్యమయ్యాయని ఓఎన్జీసీ అధికారులు తెలిపారు. తౌక్టే ధాటికి గల్లంతైన 'బార్జి పీ-305'కు చెందినవే ఇలా కొట్టుకొచ్చాయని వారు భావిస్తున్నట్లు చెప్పారు.
సమాచారం అందుకున్న ముంబయి పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం అలీబాగ్ జిల్లా ఆస్పత్రికి తరలించి, డీఎన్ఏ నమూనాలను సేకరించినట్టు తెలిపారు. బాధిత కుటుంబ సభ్యులు, బంధువులెవరైనా వస్తే వారి నమూనాలను పోల్చి.. ఆ తర్వాత వారికి మృతదేహాలను అప్పగిస్తామని స్థానిక ఎస్పీ తెలిపారు.
గుజరాత్‌లోనూ..
గుజరాత్‌లోనూ ఇదే తరహాలో అనుమానాస్పద రీతిలో నాలుగు మృతదేహాలు తీవ్ర కలకలం సృష్టిస్తున్నాయి. అరేబియా సముద్రం ఒడ్డున వల్సాద్ బీచ్‌లో ఇవి లభ్యమైనట్టు అధికారులు తెలిపారు. మృతదేహాలకు లైఫ్ జాకెట్ ఉందని అధికారులు తెలిపారు.