మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ భార్య అమృత ఫడణవీస్ ముంబయి పోలీసులను ఆశ్రయించారు. తనను అనిక్ష అనే ఓ డిజైనర్ బ్లాక్మెయిల్ చేస్తోందంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన మహా సర్కార్ పూర్తి విచారణ జరిపిస్తామని హామీ ఇచ్చింది. తనను బెదిరించి బ్లాక్మెయిల్ చేసిన డిజైనర్ అనిక్ష నగరంలోని ఉల్లాస్‌నగర్‌లో నివసిస్తోంది. ఈమె ఓ అంతర్జాతీయ క్రికెట్ బుకీగా పేరుగాంచిన అనిల్ జయసిఘని కుమార్తె. గత ఎనిమిది సంవత్సరాలుగా అనిల్.. పోలీసుల నుంచి తప్పించుకొని తిరుగుతున్నట్లుగా పోలీసుల విచారణలో తేలిందని అమృత చెప్పారు.
ఇదీ జరిగింది..
"2021 నవంబర్‌లో అనిక్ష ఓ ప్రముఖ డిజైనర్‌ను తనను తాను పరిచయం చేసుకుంది. ఆమె చెప్పిన మాటలన్నీ నేను నమ్మాను. కాగా, క్రికెట్ బుకీలకి సంబంధించి ఓ క్రిమినల్ కేసులో నన్ను జోక్యం చేసుకుని సహాయం చేయవల్సిందిగా నన్ను కోరింది. ఇందుకోసం నాకు రూ.కోటి నగదు ఇస్తానని ఆఫర్ చేసింది. ఇది విన్న వెంటనే అమృత అనిక్ష ఫోన్‌ను కట్ చేసి నంబర్‌ను బ్లాక్ లిస్ట్‌లో పెట్టాను. తర్వాత ఓ గుర్తు తెలియని నంబర్ నుంచి నాకు వీడియో క్లిప్‌లు, వాయిస్ మెసేజ్‌లు వచ్చాయి. ఇవీ అనిక్షనే పంపినట్లుగా తనకు అనుమానం ఉంది. అయితే నా భర్త దేవేంద్ర ఫడణవీస్కున్న పరిచయాలతో తన తండ్రిని ఎలాగైనా కేసుల నుంచి తప్పించాల్సిందిగా అనిక్ష నన్ను కోరింది."