రాజీనామా.. విశ్వాస పరీక్షకు ముందే ఉద్ధవ్ ఠాక్రే నిష్క్రమణ - మహావికాస్ అఘాడీ ప్రభుత్వం
Uddhav Thackeray Resigns: మహారాష్ట్రలో కొనసాగుతున్న రాజకీయ డ్రామా ముగింపు దశకు చేరుకుంది. ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే.. తన పదవికి రాజీనామా చేశారు. మహారాష్ట్ర అసెంబ్లీలో గురువారం బలపరీక్ష జరగాల్సిందేనని సుప్రీం కోర్టు తీర్పు వెలువరించిన క్షణాల్లోనే తన రాజీనామా ప్రకటించారు ఠాక్రే. ఫేస్బుక్ లైవ్‌లో మాట్లాడిన ఉద్ధవ్.. తన నిర్ణయాన్ని వెలువరించారు. ఎమ్మెల్సీ పదవికి సైతం రాజీనామా చేస్తున్నట్లు స్పష్టం చేశారు.
Uddhav Thackeray
By
Published : Jun 30, 2022, 3:12 AM IST
Uddhav Thackeray Resigns: మహారాష్ట్రలో కొనసాగుతున్న రాజకీయ డ్రామా ముగింపు దశకు చేరుకుంది. శివసేన ఎమ్మెల్యేల తిరుగుబాటుతో అశక్తుడైన ఉద్ధవ్ ఠాక్రే మహారాష్ట్ర ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. దాంతో పాటు శాసనమండలి సభ్యత్వాన్నీ వదులుకున్నారు. బలపరీక్షకు గవర్నర్ ఆదేశించడం, అందులో జోక్యానికి సుప్రీంకోర్టు నిరాకరించడంతో.. ఇక సభలో మెజారిటీ నిరూపణ కష్టమని నిర్ధారించుకున్న ముఖ్యమంత్రి రాజీనామా నిర్ణయాన్ని ప్రకటించారు. ఇక తిరుగుబాటు ఎమ్మెల్యేలు ఏం చేస్తారు? ఫడణవీస్ నేతృత్వంలో మరోసారి భాజపా ప్రభుత్వం ఏర్పాటవుతుందా? ఠాక్రే మద్దతుదారులు, ఆయన ప్రభుత్వానికి మద్దతు పలికిన కాంగ్రెస్, ఎన్‌సీపీలు ఎలా స్పందిస్తాయి? అనేవి ఇప్పుడు ఆసక్తికర అంశాలు.
మహారాష్ట్ర వ్యవహారంలో బుధవారమంతా అత్యంత నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. శాసనసభను గురువారం ఉదయం 11 గంటలకు సమావేశపరిచి, బల నిరూపణ చేసుకోవాలని గవర్నర్ భగత్‌సింగ్ కోశ్యారీ ఆదేశించారు. దీనిపై శివసేన అప్పటికప్పుడు సుప్రీంకోర్టును ఆశ్రయించినా ఎలాంటి ఊరట లభించలేదు. గవర్నర్ ఆదేశాలను న్యాయస్థానం సమర్థించి, అసెంబ్లీ వేదికగానే తేల్చుకోవాలని చెప్పింది. కోర్టు పనివేళలు ముగిసిన తర్వాత కూడా విచారణ కొనసాగించి రాత్రి 9.15 గంటల సమయంలో తీర్పు వెలువరించింది. తీర్పును గౌరవిస్తున్నట్లు ఠాక్రే చెబుతూ.. పదవి నుంచి దిగిపోతున్నట్లు రాత్రి 9.30 గంటల ప్రాంతంలో ప్రకటించారు.
పదవిని వీడుతున్నందుకు నేను పశ్చాత్తాపం చెందడం లేదు. బాలాసాహెబ్ ఠాక్రే కుమారుణ్ని సీఎం కుర్చీ నుంచి దించిన ఆనందాన్ని తిరుగుబాటు ఎమ్మెల్యేలు పొందనివ్వండి. వారంతా శివసేన, బాల్‌ఠాక్రేల ద్వారానే రాజకీయంగా ఎదిగారు. మా సొంత పార్టీ ఎమ్మెల్యేల్లో ఒక్కరు నాకు వ్యతిరేకంగా ఉన్నా అది నాకు సిగ్గుచేటు. అంకెల ఆటపై నాకు ఆసక్తి లేదు.
-ఉద్ధవ్ ఠాక్రే
వీధుల్లో ఎలాంటి నిరసనలకు దిగవద్దనీ, తిరుగుబాటు ఎమ్మెల్యేలు శాసనసభకు వెళ్లేందుకు ఎలాంటి ఆటంకం కలిగించవద్దని కార్యకర్తలకు సూచించారు. బుధవారం అర్ధరాత్రి రాజ్‌భవన్‌కు చేరుకున్న ఠాక్రే తన రాజీనామా లేఖను గవర్నర్‌కు అందజేశారు. దానిని ఆయన ఆమోదించి ఆపద్ధర్మ సీఎంగా కొనసాగాలని కోరారు.
గోవా చేరిన తిరుగుబాటు ఎమ్మెల్యేలు..
ఏక్‌నాథ్ శిందే నేతృత్వంలో గువాహటికి వెళ్లిపోయిన శివసేన తిరుగుబాటు ఎమ్మెల్యేలు అసెంబ్లీలో బల నిరూపణలో పాల్గొనేందుకు వీలుగా బుధవారం సాయంత్రం గువాహటి నుంచి బయల్దేరారు. రాత్రి అందరూ అద్దె విమానంలో గోవా చేరుకుని అక్కడే బసచేశారు. గురువారం ఉదయం అక్కడి నుంచి ముంబయికి చేరుకోవాలనేది వారి ప్రణాళిక.
శివసేన ఎమ్మెల్యేల తరఫున చీఫ్ విప్ సునీల్ ప్రభు దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టులో జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జె.బి.పార్దీవాలా ధర్మాసనం విచారణ జరిపింది. ప్రజాస్వామ్యానికి సంబంధించిన ఈ అంశాలను పరిష్కరించడానికి శాసనసభే ఏకైక మార్గమని తేల్చిచెప్పింది. అనర్హత ప్రక్రియను, లేదా దానిని చేపట్టడంలో సభాపతికి ఉన్న అధికారాలపై విశ్వాస పరీక్ష ప్రభావం ఎలా ఉంటుందని ప్రశ్నించింది. ఠాక్రే నేతృత్వంలోని వర్గం మైనారిటీలో పడిందని శిందే తరఫు న్యాయవాదులు తెలిపారు.
పార్టీలు ఫిరాయించినవారు ప్రజాభిప్రాయాన్ని ప్రతిఫలించలేరనీ, గురువారం విశ్వాస పరీక్ష జరగనంతమాత్రాన మిన్ను విరిగి మీద పడిపోదని చీఫ్ విప్ తరఫు న్యాయవాది అభిషేక్ మనుసింఘ్వి వాదించారు. రెబల్స్ అనర్హత పిటిషన్ తేలేవరకు బలపరీక్ష నిర్వహించకూడదన్నారు. ఈ వాదనను ధర్మాసనం తోసిపుచ్చింది. శివసేన పిటిషన్‌పై శాసనసభ కార్యదర్శి, తదితరులకు నోటీసులు ఇచ్చి, ఐదు రోజుల్లోగా సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. తదుపరి విచారణ జులై 11న జరగనుంది. ఎన్సీపీ ఎమ్మెల్యేలు నవాబ్ మాలిక్, అనిల్ దేశ్‌ముఖ్ గురువారం శాసనసభ ప్రత్యేక సమావేశానికి హాజరయ్యేందుకు ధర్మాసనం అనుమతించింది. సీబీఐ, ఈడీలు వీరిని అసెంబ్లీకి తీసుకువచ్చి, విశ్వాస పరీక్ష పూర్తయ్యాక తిరిగి తీసుకువెళ్లవచ్చని తెలిపింది. విశ్వాసపరీక్షకు వారిని అనుమతించకపోతే ప్రతిపక్ష నేతల్ని కారాగారాల్లో నెట్టే ప్రమాదకర సంస్కృతికి ప్రభుత్వాలు ప్రయత్నించే ప్రమాదం ఉందని అభిప్రాయపడింది.
మంత్రుల సహకారానికి ఠాక్రే కృతజ్ఞతలు!
సుప్రీంకోర్టులో విచారణ జరుగుతుండగానే మంత్రిమండలి సమావేశాన్ని ముఖ్యమంత్రి ఠాక్రే నిర్వహించారు. రెండున్నరేళ్లుగా మంత్రులు తనకు అందించిన సహకారానికి కృతజ్ఞతలు తెలిపారు. ఆ వ్యాఖ్యలతోనే ఆయన రాజీనామాపై అంచనాలు మొదలయ్యాయి. ఔరంగాబాద్ పేరును శంభాజీనగర్‌గా మార్చాలన్న తన నిర్ణయానికి కేబినెట్‌లో మిత్రపక్షాలు వ్యతిరేకించలేదని ఠాక్రే చెప్పారు. అసమ్మతి ఎమ్మెల్యేలకోసం అవసరమైతే ప్రభుత్వం నుంచి వైదొలగి, బయటి నుంచి మద్దతు ఇచ్చేందుకు కాంగ్రెస్ సిద్ధపడిందనీ, సొంతవారు మాత్రం తనను వీడి వెళ్లారని ఆవేదన వ్యక్తం చేశారు. తనతో ఇబ్బందులేమైనా ఉంటే అసమ్మతి ఎమ్మెల్యేలు నేరుగా చెప్పి ఉండాల్సిందన్నారు.
శిందే వర్గీయులతో కలిసి భాజపా ప్రభుత్వం?
ఠాక్రే వైదొలగడంతో మహారాష్ట్రలో భాజపా సర్కారు రావచ్చనే అంచనాలు మొదలయ్యాయి. శివసేన తిరుగుబాటు ఎమ్మెల్యేలు, స్వతంత్రులు మద్దతు ఇస్తే ఇది సాధ్యమేనని రాజకీయ వర్గాలు అంటున్నాయి. ఠాక్రే రాజీనామా గురించి తెలిసిన వెంటనే శిందే అనుచరులు గోవాలోని హోటల్లో సమావేశమై మంతనాలు సాగించారు.