మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ శిందే.. తన వర్గం ఎమ్మెల్యేలతో కలిసి అసోంకు వెళ్లారు. గువాహటిలోని కామాఖ్య దేవి ఆలయాన్ని సందర్శించుకునేందుకు విమానంలో బయల్దేరారు. మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం ఏర్పడినప్పుడు.. తన ఎమ్మెల్యేలతో కలిసి అక్కడే ఉన్నారు శిందే. కామాఖ్య దేవికి తమ మొక్కులు తీర్చుకునేందుకే అసోం వెళ్తున్నట్లు శిందే తాజాగా స్పష్టం చేశారు.
తన వర్గం ఎమ్మెల్యేలతో అసోంకు శిందే.. స్పెషల్ విమానంలో.. కారణం ఇదే! - shiv sena symbol fight
మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ శిందే.. మరోసారి అసోంకు పయనమయ్యారు. తన వర్గం ఎమ్మెల్యేలు, ఎంపీలతో కలిసి గువాహటికి ప్రత్యేక విమానంలో బయల్దేరి వెళ్లారు. అయితే, కొందరు మాత్రం ఈ పర్యటనకు దూరమైనట్లు తెలుస్తోంది.
"అసోం ముఖ్యమంత్రి ఆహ్వానం మేరకు మేం అక్కడికి వెళ్తున్నాం. కామాఖ్య దేవి దర్శనం చేసుకుంటాం. దీని గురించి ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు" అని ముంబయి ఎయిర్పోర్ట్లో విలేకరులతో చెప్పారు శిందే. 'రైతులకు మంచిరోజులు తెస్తాం. రాష్ట్రంలో ఉన్న సంక్షోభానికి ముగింపు పలుకుతాం' అని వ్యాఖ్యానించారు.
మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత శిందేకు తొలి పర్యటన ఇదే కావడం గమనార్హం. బాలాసాహెబ్ శివసేన (శిందే వర్గం) ఎమ్మెల్యేలతో పాటు ఎంపీలు సైతం గువాహటికి వెళ్లారు. పలువురు చట్టసభ్యులు.. తమ కుటుంబ సభ్యులను వెంటబెట్టుకొని బయల్దేరారు. అయితే, పలువురు శాసనసభ్యులు ఈ పర్యటనకు దూరం కావడం చర్చనీయాంశంగా మారింది. మంత్రులు అబ్దుల్ సత్తార్, గులాబ్రావ్ పాటిల్, తానాజీ సావంత్, ఎమ్మెల్యేలు చిమన్రావ్ పాటిల్, కిశోర్ పాటిల్, లతాతాయ్ సోన్వానే, ఉదయ్ సామంత్.. గువాహటికి వెళ్లలేదని తెలుస్తోంది. వీరంతా శిందే వర్గం పట్ల అసంతృప్తితో ఉన్నారనే వార్తలు ఒక్కసారిగా గుప్పుమంటున్నాయి.