తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఏడు గంటల పాటు బస్సుపైనే మేనేజర్​- ఎందుకంటే.. - మహారాష్ట్ర రత్నగిరి జిల్లా వార్తలు

ఓ ఆర్​టీసీ డిపో మేనేజరు.. ప్రభుత్వ డబ్బు నీటి పాలు అవ్వకుండా ఉండేందుకు ఓ బస్సుపైకి ఎక్కి ఏడు గంటల పాటు ఉన్నారు. అనంతరం అధికారులకు సమాచారం అందించారు. ప్రభుత్వ సొమ్మును కాపాడటం తన బాధ్యత అని మహారాష్ట్ర చిప్లన్​ డిపో మేనేజర్​ రంజిత్​ రాజే షిర్డే పేర్కొన్నారు.

bus manager on top of bus,
ఏడు గంటల పాటు బస్సుపైనే మేనేజర్​.. ఎందుకంటే..

By

Published : Jul 26, 2021, 6:07 PM IST

కుండపోత వర్షాలకు ఆర్​టీసీ​ బస్సు డిపో అంతా జలమయం అయింది. దాదాపు అన్ని బస్సులు నీట మునిగాయి. ఇంకాసేపు అయితే బస్సు డిపోలోని మేనేజర్​ గదికి వరద వచ్చే అవకాశాలు ఉన్నాయి. అదే జరిగితే పెద్ద మొత్తంలో అక్కడున్న డబ్బు అంతా నీటిపాలు అవుతుంది. ఈ పరిస్థితిని గమనించిన మేనేజరు వెంటనే అక్కడున్న రూ.9 లక్షల నగదును తీసుకుని.. నీట మునగకుండా ఉన్న ఓ బస్సుపైకి ఎక్కారు. వరద ఉద్ధృతి తగ్గే వరకు దాదాపు ఏడు గంటలపాటు అక్కడే ఉన్నారు. ఈ ఘటన మహారాష్ట్ర రత్నగిరి జిల్లా చిప్లన్​లో ఆదివారం జరిగింది.

మహారాష్ట్రలోని పలు ప్రాంతాల్లో ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ఆదివారం స్థానికంగా ఉన్న నదులు, వాగులు పొంగిపొర్లాయి. ఈ వరదలు రత్నగిరి, కొల్హాపుర్​, సంగ్లీ సహా చుట్టుపక్కల జిల్లాలను ముంచెత్తాయి. రత్నగిరి జిల్లా చిప్లన్ బస్సు డిపోలో పరిస్థితి కూడా ఇదే. క్రమంగా వరద ఉద్ధృతి పెరగడం వల్ల అక్కడే మేనేజరుగా పనిచేస్తున్న రంజిత్​ రాజే షిర్డే అప్రమత్తం అయ్యారు. ప్రాణం కన్నా విధులకే ప్రాధాన్యం ఇచ్చిన ఆయన.. ప్రభుత్వ సొమ్ముతో బస్సుపైకి ఎక్కి ఏడు గంటలపాటు ఉన్నారు. అనంతరం అధికారులకు సమాచారం అందించారు.

'ఈ డబ్బు నీటి పాలు అయితే దానిని నేనే బాధ్యుడ్ని అవుతాను. అందుకే ప్రమాదం గురించి ఆలోచించకుండా బస్సు ఎక్కాను' అని షిర్డే అన్నారు. తనతో పాటు అక్కడున్న పలువురు ఉద్యోగులు కూడా ప్రభుత్వ సొమ్మును జాగ్రత్త పరచేందుకు బస్సుల మీదకు ఎక్కారని షిర్డే వివరించారు.

మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలకు ఇప్పటి వరకు 164 మంది ప్రాణాలు కోల్పోయారు. 100 మంది గల్లంతైనట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. 2,29,074 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు వెల్లడించారు.

ఇదీ చదవండి :తులసి పంట వేశారు.. లక్షాధికారులు అయ్యారు!

ABOUT THE AUTHOR

...view details