Maharashtra Road Accident Reasons : మహారాష్ట్ర బుల్దానాలో జరిగిన బస్సు ప్రమాదానికి.. టైర్ పేలిపోవడం, వేగంగా బస్సు నడపడంగానీ కారణం కాదని తేలింది. ఈ మేరకు అమరావతి రీజినల్ ట్రాన్స్‌పోర్టు ఆఫీసర్ (ఆర్టీఓ) నివేదికను ఇచ్చారు. ప్రమాదం జరిగిన స్థలంలో రబ్బరు ముక్కలు గానీ, టైరులు గీసుకుపోయిన గుర్తులుగానీ లేవని ఆర్టీఓ తన నివేదికలో స్పష్టం చేశారు. మరి ఈ రెండూ కారణం కాకపోతే.. మరి ఈ ఘోర ప్రమాదానికి కారణమేమిటో ఇంకా తెలియాల్సి ఉంది.
26 మంది సజీవ దహనం
Maharashtra Bus Accident death toll : అంతకుముందు.. శనివారం వేకువజామున నాగ్‌పుర్ నుంచి పూణెకు 33 మంది ప్రయాణికులతో బయలుదేరిన బస్సు.. బుల్దానాలోని సింధ్ కేంద్రజా సమృద్ధి ఎక్స్‌ప్రెస్‌వే దగ్గర మంటల్లో చిక్కుకుంది. ఈ దుర్ఘటనలో 26 మంది సజీవ దహనం అయ్యారు. మరో 8 మంది తీవ్రంగా గాయపడ్డారు. అయితే డ్రైవర్, క్లీనర్ సహా మరికొందరు బస్సు కిటికీలు పగలగొట్టి ప్రాణాలతో బయటపడ్డారు.
సకాలంలో సాయం అంది ఉంటే..
బస్సులో చిక్కుకున్నవారు రక్షించమని ఆర్తనాదాలు చేస్తున్నా.. అటుగా వెళ్తున్న వాహనదారులు ఎవరూ సాయం చేయలేదని ఓ ప్రయాణికుడు ఆవేదన వ్యక్తం చేశాడు. సకాలంలో సాయం అంది ఉంటే.. కనీసం కొంత మంది ప్రాణాలు అయినా కాపాడగలిగే వాళ్లమని ఆయన తెలిపారు. ప్రమాదం వార్త తెలియగానే ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. గాయపడ్డ వారిని ఆస్పత్రికి తరలించారు.