కొవిడ్‌ను కట్టడి చేసేందుకు ఓ టీకాను అభివృద్ధి చేసినట్లు మహారాష్ట్ర సాంగలీకి చెందిన 'ఐసెరా బయోలాజికల్' ఫార్మా సంస్థ తెలిపింది. తాము అభివృద్ధి చేసిన టీకాకు 'యాంటీ కొవిడ్ సీరమ్' అనే పేరు పెట్టినట్లు తెలిపింది. అసలు ఈ టీకాను ఎలా అభివృద్ధి చేశారు?. ఎన్ని డోసుల్లో ఇవ్వనున్నారు అనే దానిపై ఈటీవీ-భారత్ ప్రత్యేక కథనం..
జంతువు నుంచి యాంటీబాడీలు!
సాంగలీ జిల్లాలోని షిరాలాలో ఉన్న ఐసెరా సంస్థ అభివృద్ధి చేసిన టీకా.. రెండు డోసుల్లో తీసుకుంటే కొవిడ్ నుంచి పూర్తిగా కోలుకుంటారని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. గుర్రం శరీరంలో యాంటీబాడీలు ఉత్పత్తి చేసి ఈ 'యాంటీకొవిడ్ సీరమ్'ను తయారు చేసినట్లు 'ఐసెరా బయోలాజికల్' డైరెక్టర్లు దిలీప్ కుమార్, ననందకుమార్ తెలిపారు. ముందుగా అశ్వం శరీరంలోకి వైరస్‌ను పంపించి.. యాంటీ బాడీలు పెంపొందిన తర్వాత.. యాంటీసెరా బయటకు తీసి టీకా తయారు చేసినట్లు వెల్లడించారు. కొవిడ్ రోగులపై ఈ టీకా సమర్ధవంతంగా పనిచేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
జంతువులపై ఈ టీకాను విజయవంతంగా ప్రయోగించింది 'ఐసెరా' ఫార్మా సంస్థ. అయితే.. మనుషులపై ప్రయోగాలు జరిపేందుకు సన్నద్ధమవుతోంది. ఇందుకు ఐసీఎంఆర్ అనుమతి లభించాల్సి ఉంది.
ముఖ్యమంత్రి, ప్రధానికి లేఖ..
తమ నియోజకవర్గంలోని ఓ ఫార్మా సంస్థ కొవిడ్ టీకా అభివృద్ధి చేయడంపై ఎంపీ ధైర్యషీల్ మానే హర్షం వ్యక్తం చేశారు. ట్రయల్స్ జరిపేందుకు ఈ టీకాకు అనుమతి ఇవ్వాలని కోరుతూ ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే, ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు.
"కరోనాను అంతం చేసేందుకు ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ మొదలైంది. కానీ, దురదృష్టం కొద్దీ ఇప్పటివరకు కొవిడ్‌కు సరైన మెడిసిన్ అనేది రాలేదు. మారుమూల ప్రాంతంలో ఉన్న ఐసెరా బయోలాజికల్ సంస్థ.. టీకాను అభివృద్ధి చేశామని చెబుతుంది. క్లినికల్ ట్రయల్స్‌కు ఐసీఎంఆర్ అనుమతించాల్సి ఉంది. ఈ చర్యను వేగవంతం చేసేందుకు కృషి చేస్తున్నా."