తెలంగాణ

telangana

ETV Bharat / bharat

హనీ ట్రాప్​లో DRDO సైంటిస్ట్​.. 'పాక్'​ మహిళకు రహస్య క్షిపణి సమాచారం! - పాక్​ నిఘా ఏజెంట్​ జారా దాస్‌గుప్తా డీఆర్​డీఓ

DRDO Scientist Espionage : పాక్​ నిఘా ఏజెంట్​ హనీ ట్రాప్​లో పడి అత్యంత రహస్య క్షిపణి సమాచారాన్ని చేరవేసి అరెస్టయ్యారు డీఆర్​డీఓ శాస్త్రవేత్త ప్రదీప్ ​కురుల్కర్. యాంటీ టెర్రరిజం స్క్వాడ్​ దాఖలు చేసిన ఛార్జిషీటులో విస్తుపోయే విషయాలు బయటపడ్డాయి. అవేంటంటే?

DRDO scientist espionage case
DRDO scientist espionage case

By

Published : Jul 8, 2023, 6:11 PM IST

Updated : Jul 8, 2023, 10:20 PM IST

DRDO Scientist Espionage : పాక్‌ నిఘా ఏజెంట్‌ వలపు వలలో పడి.. భారత రక్షణ రంగానికి చెందిన అత్యంత రహస్య క్షిపణి సమాచారాన్ని చేరవేసి మేలో అరెస్టైన డీఆర్​డీఓ శాస్త్రవేత్త ప్రదీప్​ కురుల్కర్​పై.. యాంటీ టెర్రరిజం స్క్వాడ్​ 1,837 పేజీల ఛార్జ్​షీటు దాఖలు చేసింది. ఇందులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. పాకిస్థాన్​ నిఘా ఏజెంట్‌ వలపు వలలో పడిన ఆయన.. ఆమెకు అత్యంత రహస్య విషయాలు పంపినట్లు పోలీసులు తెలిపారు.

ఛార్జ్‌షీట్‌లో ఉన్న వివరాల ప్రకారం.. ప్రదీప్‌ కురుల్కర్‌.. మహారాష్ట్రలోని పుణెలో ఉన్న రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ- డీఆర్‌డీవో ల్యాబ్‌ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు గతేడాది 'జారా దాస్‌గుప్తా' పేరుతో ఒక మహిళ పరిచయమైంది. తానో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ అని.. యూకేలో పనిచేస్తున్నానని ప్రదీప్​ను నమ్మించింది. ఆ తర్వాత ఆయనకు అశ్లీల వీడియోలు, మెసేజ్‌లు పంపి దగ్గరైంది. వీరిద్దరూ వాట్సాప్‌లో వాయిస్‌, వీడియో కాల్స్‌ కూడా చేసుకున్నారు. ఈ క్రమంలోనే ఆమెకు ఆకర్షితుడైన ప్రదీప్‌.. భారత క్షిపణి వ్యవస్థకు చెందిన అత్యంత రహస్య సమాచారం, రక్షణ రంగ ప్రాజెక్టుల గురించి సమాచారం ఇచ్చినట్లు పోలీసులు తెలిపారు.

డ్రోన్లు, క్షిపణులు, బ్రహ్మోస్‌, అగ్ని క్షిపణి లాంఛర్లు, యూసీవీ, మిలిటరీ బ్రిడ్జింగ్‌ సిస్టమ్‌ వంటి పలు రక్షణ రంగ ప్రాజెక్టుల గురించి వీరిద్దరూ చాటింగ్‌ చేసినట్లు పోలీసుల దర్యాప్తులో తెలిసింది. ఈ ప్రాజెక్టులకు సంబంధించి తన వ్యక్తిగత ఫోన్లో ఉన్న సమాచారాన్ని ప్రదీప్‌ ఆమెకు పంపినట్లు తేలింది. 2022 జూన్‌ నుంచి డిసెంబరు మధ్య వీరిద్దరూ చాటింగ్‌ చేసుకున్నట్లు ఛార్జ్‌షీట్‌లో ఏటీఎస్​ పోలీసులు పేర్కొన్నారు. ప్రదీప్​ కార్యకలాపాలపై అనుమానం రావడం వల్ల.. డీఆర్‌డీఓ అంతర్గత దర్యాప్తు చేపట్టింది. దర్యాప్తు విషయం తెలియగానే ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రదీప్‌.. జారా ఫోన్ నంబరును బ్లాక్‌ చేసినట్లు తెలిసింది. అనంతరం ఆయనకు మరో భారతీయ నంబర్​ నుంచి 'మీరు నా నంబర్​ను ఎందుకు బ్లాక్​ చేశారు?' అని మెసేజ్​ వచ్చింది.

అధికారిక షెడ్యూళ్లు, లొకేషన్లకు సంబంధించిన కీలక సమాచారాన్ని ఎవరితోనూ పంచుకోవద్దని తెలిసినా.. ప్రదీప్‌ ఆ విషయాలను జారాకు చేరవేసినట్లు యాంటీ టెర్రరిజం స్క్వాడ్​ అధికారులు దర్యాప్తులో గుర్తించారు. ఐపీ అడ్రస్​ ద్వారా జారా నంబరును ట్రేస్‌ చేయగా.. పాకిస్థాన్‌ నుంచి చాట్‌ చేసినట్లు తెలిసింది. ఆమె పాక్‌ నిఘా సంస్థకు చెందిన ఏజెంట్‌గా గుర్తించిన అధికారులు.. ఈ ఏడాది మే 3వ తేదీన ప్రదీప్‌ను అరెస్టు చేశారు. ప్రస్తుతం ప్రదీప్​ జ్యుడీషియల్‌ కస్టడీలో ఉన్నారు.

హానీ ట్రాప్​లో మరో ఉద్యోగి..
దేశానికి సంబంధించిన రహస్య సమాచారాన్ని పాకిస్థాన్‌కు చేరవేసిన సరిహద్దు భద్రత దళం- బీఎస్​ఎఫ్​ తాత్కాలిక ఉద్యోగి నీలేశ్‌ బలియాను ఏటీఎస్​ అధికారులు అరెస్ట్‌ చేశారు. గుజరాత్‌లోని భుజ్‌లో బీఎస్​ఎఫ్​ కార్యాలయంలో కాంట్రాక్టు ఉద్యోగిగా పనిచేస్తున్నట్లు గుర్తించారు. నిందితుడు నీలేశ్‌ ఐదేళ్ల నుంచి బీఎస్​ఎఫ్​ ప్రధాన కార్యాలయం సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్లో ప్యూన్‌గా పనిచేస్తున్నాడని అధికారులు తెలిపారు.

2023 జనవరిలో పాకిస్థాన్‌ ఏజెంట్‌....అదితి తివారీ పేరుతో నీలేశ్‌కు పరిచయమైనట్లు చెప్పారు. ఇద్దరు వాట్సాప్‌ ద్వారా చాటింగ్‌ చేసుకునేవారని ATS అధికారులు చెప్పారు. డబ్బుకు ఆశపడి హానీ ట్రాప్‌లో చిక్కుకొన్న నీలేశ్‌ బలియా....నిర్మాణంలో ఉన్న భవనాల విద్యుద్దీకరణ పనులతోపాటు పౌర విభాగాలకు సంబంధించిన కీలకపత్రాలను పాక్‌ ఏజెంట్‌తో పంచుకున్నట్లు తెలిపారు. యూపీఐ ద్వారా నీలేశ్‌ బ్యాంకు ఖాతాలో రూ.28,800 జమ అయినట్లు గుర్తించిన ATS అధికారులు.. ఈ ఘటనపై పూర్తి విచారణ చేస్తున్నట్లు తెలిపారు.

Last Updated : Jul 8, 2023, 10:20 PM IST

ABOUT THE AUTHOR

...view details