Mimicry of Modi: ప్రధాని నరేంద్ర మోదీని అనుకరిస్తూ శివసేన ఎమ్మెల్యే భాస్కర్ జాదవ్ సంజ్ఞలు చేయడం మహారాష్ట్ర అసెంబ్లీలో బుధవారం తీవ్ర దుమారానికి తెరలేపింది. ఆయన చేష్టలు ప్రధానిని ఎగతాళి చేసేలా ఉన్నాయంటూ ప్రతిపక్ష నేత దేవేంద్ర ఫడణవీస్ సహా భాజపా నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
సభా కార్యకలాపాలు స్తంభించడంతో.. చివరకు జాదవ్ క్షమాపణలు చెప్పాల్సి వచ్చింది. విద్యుత్తు సంబంధిత అంశాల్లో ఇచ్చిన హామీలను రాష్ట్ర ప్రభుత్వం నిలబెట్టుకోలేదని సభలో కమలదళ సభ్యులు తొలుత విమర్శలు గుప్పించారు. దానిపై విద్యుత్తు శాఖ మంత్రి నితిన్ రౌత్ స్పందిస్తూ... ప్రధాని మోదీ కూడా రైతులకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేదని పేర్కొన్నారు. ఆ సమయంలో మోదీని అనుకరిస్తూ జాదవ్ చేతి సంజ్ఞలు చేశారు. ఫలితంగా సభలో పెద్ద దుమారం చెలరేగింది.
ప్రధానిని ఎమ్మెల్యే అవమానించారంటూ ప్రతిపక్ష నేతలు మండిపడ్డారు. ఆయన క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. గందరగోళం మధ్య సభ రెండుసార్లు వాయిదా పడింది. తిరిగి సభ సమావేశమయ్యాక జాదవ్ మాట్లాడుతూ... తాను ప్రధానికి వ్యతిరేకంగా ఎలాంటి వ్యాఖ్యలూ చేయలేదన్నారు. 2014లో మోదీ ప్రధాని అభ్యర్థిగా ఉన్నప్పుడు చెప్పినవాటి గురించే మాట్లాడానని తెలిపారు. తన వ్యాఖ్యలు, సంజ్ఞలు ఎవరికైనా బాధ కలిగించి ఉంటే... వారికి క్షమాపణలు తెలియజేస్తున్నానని పేర్కొన్నారు.