Maharashtra accident news : మహారాష్ట్రలోని ధూలె జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 10 మంది మరణించారు. లోడుతో వెళ్తున్న ఓ లారీ.. ఓ కారు సహా పలు వాహనాలను ఢీకొట్టింది. ఆ తర్వాత రోడ్డు పక్కనే ఉన్న హోటల్లోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో 10 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 20 మందికి గాయాలయ్యాయి. ముంబయి- ఆగ్రా హైవేపై మహారాష్ట్ర-మధ్యప్రదేశ్ సరిహద్దులో ఉన్న పలసనేర్ ప్రాంతంలో ఉదయం 10.45 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. క్షతగాత్రులను శిర్పూర్ కాటేజ్ ఆస్పత్రికి తరలించారు.
నాలుగుకు పైగా వాహనాలు అనూహ్య రీతిలో ప్రమాదానికి గురయ్యాయని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. అధికారుల వివరాల ప్రకారం.. నర్మదా ఎంఐడీసీలోని వండర్ సిమెంట్ కంపెనీ కోసం ఓ లారీ గులకరాళ్ల లోడుతో వెళ్తోంది. వేగంగా వెళ్తున్న ఆ లారీ బ్రేకులు ఒక్కసారిగా ఫెయిల్ అయ్యాయి. దీంతో డ్రైవర్ నియంత్రణ కోల్పోయాడు. ఫలితంగా రెండు ద్విచక్రవాహనాలతో పాటు ఓ కారును, మరో కంటైనర్ను వెనక నుంచి లారీ ఢీకొట్టింది. ఆ తర్వాత హైవేపై బస్టాప్ సమీపంలో ఉన్న హోటల్లోకి దూసుకెళ్లింది. బాధితుల్లో కొందరు బస్టాప్ వద్ద ఎదురుచూస్తున్నవారు సైతం ఉన్నారని అధికారులు తెలిపారు. ప్రమాదానికి గురైన లారీ మధ్యప్రదేశ్ నుంచి ధూలెకు వెళ్తోందని చెప్పారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు అప్రమత్తమయ్యారని.. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారని వివరించారు.