ఉత్తర్ ప్రదేశ్‌లో ఓ ఎనిమిదో తరగతి విద్యార్థి.. ఆరో తరగతి చదివే విద్యార్థినిపై మనసు పడ్డాడు. ఆ విషయం ఆ బాలికకు కూడా చెప్పాడు. కానీ ఆ బాలిక అతడ్ని పట్టించుకోలేదు. అయినా సరే ఆ బాలుడు అక్కడితో ఆగలేదు.. ఆమె ఇంటికి చేరుకుని.. మెడపై కత్తిపెట్టి నుదుటన తిలకం దిద్దాడు. ఈ వింత ఘటన శనివారం జరగగా.. పోలీసులు ఆ నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నారు.
ఆరో తరగతి బాలికకు బొట్టు పెట్టిన 8th క్లాస్ స్టూడెంట్.. ప్రేమిస్తున్నానంటూ మెడపై కత్తి పెట్టి.. - ఆరో తరగతి విద్యార్థినిని కత్తితో బెదిరించిన బాలుడు
ఎనిమిదో తరగతి చదువుతున్న ఓ విద్యార్థి.. ఆరో తరగతి చదువుతున్న విద్యార్థినిని కత్తితో బెదిరించి.. ఆమె నుదుటన తిలకం దిద్దాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నారు. ఈ వింత ఘటన ఉత్తర్‌ప్రదేశ్ మహారాజ్‌గంజ్‌లో జరిగింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
మహారాజ్‌గంజ్ జిల్లాలో ఈ వింత ఘటన వెలుగు చూసింది. సిందూరియా పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ గ్రామానికి చెందిన విద్యార్థి మహారాజ్‌గంజ్ ప్రాంతంలోని ఓ స్కూల్లో ఎనిమిదో తరగతి చదువుతున్నాడు. బాధిత బాలిక కూడా గతంలో అదే స్కూల్లో చదువేది. ఆ సమయంలో నిందితుడు ఆ బాలికను ప్రేమ పేరుతో వేధించేవాడు. వేధింపులు తాళలేక బాలిక ఆ విషయం తన తండ్రికి చెప్పింది. అయితే.. ఈ విషయం బయటకు వస్తే తమ పరువుపోతుందనే ఉద్దేశంతో బాలిక తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. అనంతరం తన కుమారైను నగరంలోని మరో పాఠశాలకు మార్చాడు. బాలిక స్కూల్ మారినా సరే.. నిందితుడు ఆమె వెంటపడి వేధించడం ఆపలేదు.
శనివారం సాయత్రం నిందితుడు తన స్నేహితుడితో కలిసి బైక్‌పై బాలిక ఇంటికి వచ్చాడు. ఇంట్లోకి ప్రవేశించిన నిందితుడు బాలిక చేతిని పట్టుకుని.. తన వెంట తెచ్చుకున్న కత్తిని ఆమె గొంతుపై పెట్టాడు. అనంతరం ఆమె నుదుటన సింధూరం పెట్టి అక్కడ నుంచి పరారయ్యాడు. ఈ విషయాన్ని బాలిక తన తండ్రికి తెలియజేయగా.. సదర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. బాధితురాలి తండ్రి ఫిర్యాదుతో.. పోలీసులు నిందితుడిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి.. అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు మైనర్ కావడం వల్ల ఆదివారం ఉదయం జువైనల్ కోర్టులో హాజరుపరిచినట్లు ఏఎస్పీ అజయ్ సింగ్ చౌహన్ వెల్లడించారు.