Mahadev Betting App Scam ED :ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికల వేల కీలక పరిణామం జరిగింది. దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన మహాదేవ్ బెట్టింగ్ యాప్ వ్యవహారం ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేశ్ బఘేల్ మెడకు చుట్టుకుంది. మహాదేవ్ బెట్టింగ్ యాప్ ప్రమోటర్లు ఛత్తీస్‌గఢ్ సీఎం భూపేశ్ బఘేల్‌కు రూ.508 కోట్లు మేర ఇచ్చినట్లు ఆరోపించింది. దీనిపై విచారణ చేయాల్సి ఉందని పేర్కొంది. ఈ కేసులో యూఏఈ నుంచి వచ్చిన క్యాష్ కొరియర్‌గా పేర్కొనే అసిమ్ దాస్ అనే వ్యక్తి ఇళ్లు, కారులో రూ.5.39 కోట్ల నగదును ఈడీ సీజ్ చేసింది. అనంతరం అతడిని అరెస్టు చేసినట్లు దర్యాప్తు సంస్థ ప్రకటించింది.
'క్యాష్ కొరియర్' అసిమ్‌దాస్‌ను విచారించి.. అతడి నుంచి వాంగ్మూలం రికార్డు చేసినట్లు ఈడీ పేర్కొంది. అలాగే, అతడి ఫోన్ సీజ్ చేసి ఫోరెన్సిక్ పరీక్షలు చేయించగా.. శుభం సోనీ (మహదేవ్ నెట్‌వర్క్‌లో కీలక నిందితుల్లో ఒకరు) పంపిన ఈ-మెయిల్‌ను పరిశీలిస్తే ఆశ్చర్యకరమైన అంశాలు తెలిశాయని పేర్కొంది. గతంలో రెగ్యులర్‌గా చెల్లింపులు జరిగాయని.. ఇప్పటివరకు మహదేవ్ యాప్ ప్రమోటర్లు సీఎం భూపేశ్ బఘేల్‌కు దాదాపు రూ.508 కోట్లు మేర చెల్లించినట్లు ఈడీ ఓ ప్రకటనలో పేర్కొంది. ఈడీ సీజ్ చేసిన డబ్బును ఛత్తీస్‌గఢ్‌లో జరగనున్న ఎన్నికల ఖర్చు కోసం యాప్ ప్రమోటర్లు ఒక రాజకీయ నేతకు డెలివరీ చేసేందుకు పంపించినట్లు అసిమ్ దాస్ అంగీకరించాడని ఈడీ ఆరోపించింది. ఈ నగదు సీజ్‌కు సంబంధించిన వ్యవహారంలో ఒక పోలీస్ కానిస్టేబుల్‌ను కూడా అరెస్టు చేసినట్లు ఈడీ తెలిపింది.