తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'బఘేల్​కు రూ.508కోట్లు!'- 'కాంగ్రెస్​ ఎన్నికల ప్రచారానికి బెట్టింగ్​ సొమ్ము, సీఎం జైలుకు వెళ్లడం పక్కా' - మహదేవ్ బెట్టింగ్​ యాప్​ ఛత్తీస్​గఢ్​

Mahadev Betting App Scam Baghel : ఛత్తీస్‌గఢ్‌లో శాసనసభ ఎన్నికల వేళ మహదేవ్‌ బెట్టింగ్‌ యాప్‌ కేసు కలకలం సృష్టిస్తోంది. బెట్టింగ్​ యాప్​ నిర్వాహకులు చెల్లించిన డబ్బును ఛత్తీస్​గఢ్​ ఎన్నికల ప్రచారానికి కాంగ్రెస్​ ఉపయోగించుకుందని బీజేపీ ఆరోపించింది. బఘేల్​కు సంబంధించిన షాకింగ్​ నిజాలు.. దేశ ప్రజల ముందు బయటపడ్డాయని వ్యాఖ్యానించింది. మరోవైపు, బీజేపీ ఆరోపణలను కాంగ్రెస్​ ఖండించింది.

Mahadev Betting App Scam Baghel
Mahadev Betting App Scam Baghel

By ETV Bharat Telugu Team

Published : Nov 4, 2023, 12:40 PM IST

Updated : Nov 4, 2023, 12:51 PM IST

Mahadev Betting App Scam Baghel : ఛత్తీస్‌గఢ్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి భూపేశ్​ బఘేల్‌పై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ చేసిన ఆరోపణలు సంచలనం రేపుతున్నాయి. మహదేవ్ బెట్టింగ్ యాప్ ప్రమోటర్ల నుంచి సీఎం భూపేశ్​ బఘేల్‌కు రూ.508 కోట్ల రూపాయలు చెల్లింపులు జరిగాయని ఈడీ అధికారులు ఆరోపించడం వల్ల అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం ప్రారంభమైంది.​ యాప్​ నిర్వాహకుల చెల్లించిన డబ్బును ఛత్తీస్​గఢ్​ ఎన్నికల ప్రచారానికి కాంగ్రెస్​ ఉపయోగించుకుందని బీజేపీ ఆరోపించింది.

'ఎన్నికల చరిత్రలో ఇలాంటి సాక్ష్యాలను..'
సీఎం భూపేశ్​ బఘేల్​.. ప్రజల మద్దతుతో కాకుండా బెట్టింగ్​ యాప్​ ఆపరేటర్ల మద్దతుతో ఎన్నికల్లో పోరాడుతున్నారని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ఆరోపించారు. ఎన్నికల చరిత్రలో ఇలాంటి సాక్ష్యాలను ప్రజలు ఎప్పుడూ చూడలేదని విమర్శలు చేశారు. అధికారంలో ఉంటూ భూపేశ్​ బఘేల్​ బెట్టింగ్​ గేమ్​ ఆడారని తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. ఛత్తీస్​గఢ్​తోపాటు ఆంధ్రప్రదేశ్​లో పోలీసుల దర్యాప్తు వివరాల ఆధారంగానే ఈడీ దర్యాప్తు చేస్తోందని తెలిపారు. కాంగ్రెస్​ ప్రచారానికి బెట్టింగ్​ డబ్బును ఉపయోగించినట్లు నిందితుల వాయిస్​ మెసేజ్​లు ఉన్నట్లు పేర్కొన్నారు.

'డబ్బులు అందుకున్న మాట నిజమేనా?'
"ఛత్తీస్​గఢ్ ముఖ్యమంత్రి భూపేశ్​ బఘేల్​ గురించి షాకింగ్​ నిజాలు.. దేశ ప్రజల ముందు బయటపడ్డాయి. అసిమ్​ దాస్​ అనే వ్యక్తి నుంచి రూ.5.30 కోట్లకుపైగా నగదు స్వాధీనం చేసుకున్నారు అధికారులు. కాంగ్రెస్​ నేతలు.. శుభమ్​ సోనీ, అసిమ్​ దాస్​ ద్వారా డబ్బులు అందుకున్న మాట నిజమేనా? రాయ్​పుర్​ వెళ్లి ఎన్నికల ఖర్చుగా బఘేల్​కు డబ్బులు ఇవ్వాలని అసిమ్​కు శుభమ్​ ఆదేశించిన విషయం నిజమేనా?" అని స్మృతి ఇరానీ ప్రశ్నించారు.

'కాంగ్రెస్​కు అలవాటే!'
మహాదేవ్‌ బెట్టింగ్‌ యాప్‌ కేసుపై కేంద్ర మంత్రి రాందాస్‌ అఠవాలే స్పందించారు."ఇదో పెద్ద అవినీతి... అవినీతికి పాల్పడడం, అధికారంలోకి రావడం, ప్రజలను తప్పుదోవ పట్టించడం కాంగ్రెస్‌కు అలవాటు. భూపేశ్​ బఘేల్ ఆట ముగిసిపోతుంది. జైలుకు వెళ్లాల్సి వస్తుంది. సాక్ష్యాధారాలు దొరికిన తర్వాతే ప్రభుత్వ సంస్థలు విచారణ జరుపుతాయి. కాబట్టి ప్రభుత్వాన్ని నిందించడం మంచిది కాదు. బఘేల్ హయాంలో అవినీతి బాగా పెరిగిపోయింది" అని ఆరోపించారు.

బీజేపీ విమర్శలను ఖండించిన కాంగ్రెస్​
మరోవైపు, బీజేపీ చేసిన ఆరోపల్ని కాంగ్రెస్​ ఖండించింది. సీఎం భూపేశ్​ బఘేల్​ ప్రతిష్ఠను దిగజార్చేందుకు బీజేపీ కుట్ర పన్నిందని తీవ్రస్థాయిలో మండపడింది. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఇలాంటి వ్యూహాలకు ప్రజలు తగిన సమాధానం చెబుతారని విమర్శించారు. రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓటమి ఖాయమని కాంగ్రెస్​ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్​ జోస్యం చెప్పారు. ఈడీ, సీబీఐ వంటి కేంద్ర ఏజెన్సీలను బీజేపీ దుర్వినియోగం చేస్తోందని ఆరోపించారు. రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌ ప్రజలకు కాంగ్రెస్‌పై విశ్వాసం ఉందని, బీజేపీ ప్రతీకార రాజకీయాలకు పాల్పడుతోందని ఆరోపణలు చేశారు. బఘేల్​ ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు స్పష్టమైన కుట్ర జరుగుతోందని కాంగ్రెస్​ నాయకుడు కేసీ వేణుగోపాల్​ ఆరోపించారు. రాబోయే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి ప్రజలు తగిన సమాధానం చెబుతారని అన్నారు.

'ఇంతకంటే పెద్ద జోక్​ ఉండదు'
ఈడీ ఆరోపణలపై స్పందించిన భూపేశ్​ బఘేల్‌.. ఇంతకంటే పెద్ద జోక్‌ ఉండదని అన్నారు. ఈ ఎన్నికల్లో బీజేపీ రాజ్యాంగ సంస్థలను ఉపయోగించుకుని పోటీ చేయాలని అనుకుంటోందని ఎద్దేవా చేశారు. తాము కూడా ఎవరో ఒకర్ని పట్టుకుని.. ఆ పట్టుకున్న వ్యక్తి ప్రధాని మోదీ పేరు చెప్తే ఆయనను విచారిస్తారా అని బఘేల్‌ ప్రశ్నించారు. ఒకరి ప్రతిష్ఠను నాశనం చేయడం చాలా సులభమని అన్నారు.

Bhupesh Baghel Properties : నామినేషన్ వేసిన ఛత్తీస్​గఢ్​ సీఎం.. బఘేల్​ ఆస్తులు ఎంతో తెలుసా?

Last Updated : Nov 4, 2023, 12:51 PM IST

ABOUT THE AUTHOR

...view details