మహారాష్ట్రలో కురిసిన కుండపోత వర్షానికి జనజీవనం స్తంభించిపోయింది. కొంకణ్ ప్రాంతంలోని రత్నగిరి, రాయ్‌గఢ్ జిల్లాల్లో అపార నష్టం వాటిల్లింది. వర్షాల కారణంగా మహారాష్ట్రలో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 136కి చేరినట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. మరోవైపు.. రాయ్‌గఢ్ జిల్లా మహర్ తాలుకా తలాయి గ్రామంలో కొండ చరియలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య 44కి పెరిగింది.
అక్కడ సుమారు 30 ఇళ్లు ఉండగా బండలు పడటం వల్ల ఆ గ్రామం తుడిచిపెట్టుకు పోయింది. శిథిలాల కింద చిక్కుకుని గాయపడిన 35 మంది ఆస్పత్రికి చికిత్స పొందుతున్నారని.. రాయ్‌గఢ్ జిల్లా కలెక్టర్ తెలిపారు. భారీ వర్షాల కారణంగా జిల్లాలో 6 చోట్ల కొండ చరియలు విరిగిపడ్డాయి.
సుమారు 50 మంది వరకు శిథిలాల కింద చిక్కుకుని ఉంటారని.. అధికారులు భావిస్తున్నారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాల ద్వారా సహాయ చర్యలు కొనసాగిస్తున్నట్లు.. చెప్పారు.