Patient Dead Due To PowerCut: మహారాష్ట్రలోని కొల్హాపుర్ జిల్లాలో విషాద ఘటన జరిగింది. ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతున్న ఓ వ్యక్తి.. తన ఇంట్లో వెంటిలేటర్ సపోర్ట్ మీద ఉన్నాడు. విద్యుత్ అంతరాయం కారణంగా వెంటిలేటర్ పనిచేయక గురువారం మరణించాడు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు.
పోలీసుల వివరాల ప్రకారం.. కొల్హాపుర్ జిల్లాలోని ఉచ్గావ్ గ్రామంలో అమేష్ కాలే(38) అనే వ్యక్తి గత కొన్ని సంవత్సరాలుగా ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతున్నాడు. కుటుంబసభ్యులు అతడిని ఇంట్లో వెంటిలేటర్‌పై ఉంచారు. వారు ఉన్న ప్రాంతానికి మే 30న విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. అయినా తాత్కాలిక ఏర్పాట్లు చేశారు కుటుంబసభ్యులు. కొన్ని రోజులు పనిచేసిన వెంటిలేటర్.. గురువారం పనిచేయలేదు. దీంతో అతడు ఊపిరాడక మరణించాడు. వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లినా లాభం లేకుండా పోయింది. ఆ తర్వాత అతడి కుటుంబసభ్యులు ఆసుపత్రి బయట బాధితుడి మృతదేహంతో ధర్నా చేపట్టారు. పోలీసులు వచ్చి సర్దిచెప్పడం వల్ల మృతదేహాన్ని తీసుకుని ఇంటికి వెళ్లారు.