Maharastra Heavy Rains: గత కొన్ని రోజులుగా మహారాష్ట్రలో కురుస్తోన్న భారీ వర్షాలు జనజీవనాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. హింగోలి జిల్లాలోని ఓ గ్రామంలో వరదల ధాటికి దాదాపు 300 కుటుంబాలు నాలుగు రోజులుగా ఆకలితో అలమటిస్తున్నాయి. వరద బీభత్సానికి తమ ఆహార ధాన్యాలు, వస్తువులను కోల్పోవడం వల్ల తినడానికి వంట చేసుకొనే పరిస్థితి లేకపోవడం వల్ల వారంతా బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. గ్రామ పంచాయతీ, కొన్ని స్వచ్ఛంద సంస్థలు అందిస్తున్న ఆహారం తింటూ అర్ధాకలితో నెట్టుకొస్తున్నారు. హింగోలి జిల్లా బాస్మత్ తాలుకాలోని కురుంద గ్రామంలో శని, ఆదివారాల్లో భారీ వర్షాలతో వరద నీరు పోటెత్తడం వల్ల జనజీవనం స్తంభించింది.
'కుటుంబానికి రూ. ఐదు వేలు జమ'..ఆ గ్రామంలో పరిస్థితిపై స్థానిక అధికారులు స్పందించారు. ప్రస్తుతం వరదనీరు తగ్గుతోందని, బాధిత కుటుంబాలకు రూ.5వేలు చొప్పున సాయంగా జమచేస్తామని వెల్లడించారు. గ్రామంలో పరిస్థితిపై కురుంద సర్పంచ్ రాజు ఇంగోలే ఓ వార్తా సంస్థతో మాట్లాడుతూ.. తమ గ్రామంలో వరదనీరు దాదాపు 1100 ఇళ్లలోకి ప్రవేశించిందని చెప్పారు. దీంతో ప్రజలు ఇంట్లో దాచుకున్న ఆహార ధాన్యాలు, ఇతర వస్తువులను కోల్పోయారన్నారు. ప్రస్తుతం వరదనీరు తగ్గుముఖం పడుతున్నప్పటికీ ఎడతెరిపిలేకుండా వర్షాలు కురుస్తున్నాయని వివరించారు.
'150 ఇళ్లు కూలిపోయాయి'.. తమ గ్రామంలో దాదాపు 150 ఇళ్లు కూలిపోయాయని ఆవేదన వ్యక్తంచేశారు. తొలుత గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో ప్రజలకు ఆహారం సరఫరా చేసినప్పటికీ.. ఇప్పుడు ఆ పనిని ఎన్జీవోలు కొనసాగిస్తున్నాయని చెప్పారు. అలాగే, కురుంద, సమీప గ్రామాల్లో వరదనీటి ప్రవాహంతో దాదాపు 14వేల హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నట్టు రెవెన్యూ అధికారులు వెల్లడించారు. ఈ వరదల ధాటికి 162 మూగ జీవాలు కూడా ప్రాణాలు కోల్పోయినట్టు చెప్పారు. వరద బాధితుల కోసం పాఠశాలల్లో తాత్కాలిక శిబిరాలను ఏర్పాటు చేసినట్టు చెప్పారు.
నాసిక్‌లో ఆరుగురు గల్లంతు.. మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలో భారీ వర్షాల కారణంగా ఆరుగురు గల్లంతయ్యారని, వారిలో ఒకరి మృతదేహం లభ్యమైందని అధికారులు తెలిపారు. జిల్లాలోని పేట్, సుర్గాన, త్రయంబకేశ్వర్‌లో మంగళవారం భారీ వర్షం కురిసిందని, నాసిక్ నగరంలో బుధవారం కూడా కుండపోత వర్షాలు కురుస్తున్నాయని చెప్పారు. దిండోరి ప్రాంతంలో తన మామతో కలిసి అలందీ నది దాటుతుండగా ఆరేళ్ల బాలిక గల్లంతైందని, వెంటనే ఆమె మేనమామ ఈదుకుంటూ వెళ్లి కాపాడినా.. అప్పటికే బాలిక మరణించినట్లు పోలీసు అధికారి తెలిపారు.