Maharastra Assembly Speaker: మహారాష్ట్ర రాజకీయ సంక్షోభం ముగింపు దశకు చేరింది. కొత్త సీఎం ఏక్‌నాథ్ శిందే సర్కారు బలనిరూపణకు వీలుగా ఆదివారం అసెంబ్లీ స్పీకర్ ఎన్నిక జరిగింది. స్పీకర్ పదవి కోసం భాజపా తరపున రాహుల్ నర్వేకర్.. మహావికాస్ అఘాడీ తరపున రాజన్ సాల్వీ పోటీపడ్డారు. శివసేన తిరుగుబాటు నేత, ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ శిందే.. భాజపాతో చేతులు కలిపిన నేపథ్యంలో రాహుల్ నర్వేకర్ స్పీకర్ పదవికి ఎన్నికయ్యారు. రాహుల్ నర్వేకర్కు అనుకూలంగా 164 ఓట్లు రాగా, వ్యతిరేకంగా 107 ఓట్లు పడ్డాయి. స్పష్టమైన మెజార్టీ సాధించడం వల్ల స్పీకర్గా రాహుల్ ఎన్నికైనట్లు డిప్యూటీ స్పీకర్ ప్రకటించారు. అనంతరం రాహుల్ నర్వేకర్కు సీఎం ఏక్‌నాథ్ శిందే, డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడణవీస్ అభినందనలు తెలిపారు.
దేశంలోనే అతిపిన్న వయసు గల స్పీకర్..మహారాష్ట్ర అసెంబ్లీకి నూతన స్పీకర్గా ఎన్నికైన రాహుల్ నర్వేకర్.. దేశంలోనే అతి పిన్నవయసు గల అసెంబ్లీ స్పీకర్ అని ఉపముఖ్యమంత్రి ఫడణవీస్ తెలిపారు. అంతేకాకుండా ఎన్సీపీ నాయకుడు, ప్రస్తుత శాసనమండలి ఛైర్మన్ రామ్రాజేనాయక్ నింబాలాకర్ అల్లుడే రాహుల్ నర్వేకర్ అని గుర్తుచేశారు.
శివసేన కార్యాలయానికి సీల్.. ముఖ్యమంత్రి శిందే నేతృత్వంలోని శివసేన నేతలు.. విధాన్భవన్లోని శాసనసభాపక్ష కార్యాలయాన్ని సీల్ చేశారు. దాంతో పాటు కార్యాలయం తలుపు మీద నోటీసు అంటించారు. శివసేన శాసనసభాపక్షం సూచనల మేరకు కార్యాలయాన్ని మూసివేస్తున్నాం అని దానిపై మరాఠీలో రాసి ఉంది. మరోవైపు, సోమవారం మహా సీఎం శిందే బలపరీక్ష ఎదుర్కోనున్నారు. 39 మంది శివసేన తిరుగుబాటు ఎమ్మెల్యేలు, 11 మంది స్వతంత్రులు.. శనివారం గోవా నుంచి ముంబయి చేరుకున్నారు. వీరంతా శిందేకు మద్దతుగా నిలుస్తారా? అనేది ఓటింగ్‌లో తేలనుంది.
తెరపైకి ఆరే మెట్రో కార్ షెడ్ వివాదం..
మెట్రో కార్షెడ్ ప్రాజెక్టును ఆరే కాలనీలోనే నిర్మించాలని సీఎం ఏక్‌నాథ్ శిందే తీసుకున్న నిర్ణయంపై పర్యావరణ కార్యకర్తలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మరోసారి ఆందోళనలకు సిద్ధమయ్యారు. 'నగరంలోని ప్రజలకు స్వచ్ఛమైన గాలిని అందించడమే కాకుండా, కొన్ని స్థానిక జాతులతో సహా వన్యప్రాణులకు ఆరే కాలనీ ఆవాసంగా ఉంది' అని పర్యావరణ కార్యకర్తలు చెబుతున్నారు. అడవిలో దాదాపు ఐదు లక్షల చెట్లు ఉన్నాయి. వాటితోపాటు రెండు నదులు, సరస్సులు ప్రవహిస్తున్నాయని తెలిపారు. ఠాక్రే సర్కారు పక్కనబెట్టిన ఈ ప్రాజెక్టును.. ఇటీవల ప్రమాణస్వీకారం చేసిన వెంటనే పట్టాలెక్కించారు శిందే. ఆ ప్రాజెక్టును తిరిగి ఆరే కాలనీలోనే నిర్మించాలని నిర్ణయించారు.