Magic Mirror Fraud :'మాయా అద్దం'తో మనుషులను నగ్నంగా చూడవచ్చని 72 ఏళ్ల వృద్ధుడ్ని మోసం చేశారు ముగ్గురు వ్యక్తులు. అనంతరం బాధితుడి నుంచి రూ.9 లక్షలు వసూలు చేశారు. అమెరికా నాసా శాస్త్రవేత్తలే ఈ అద్దాన్ని ఉపయోగించారనే మాయామాటలతో.. వృద్ధుడ్ని బోల్తా కొట్టించారు. చివరకు మోసాన్ని గ్రహించిన బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు.
నిందితులు పార్థ సింగ్రే, మొలయా సర్కార్, సుదీప్తా సిన్హా రాయ్. బాధితుడు అవినాశ్ కుమార్.. ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన వ్యక్తి. తాము పురాతన వస్తువులను సేకరించే ప్రముఖ కంపెనీలో పనిచేస్తున్నట్లు బాధిత వృద్ధుడితో పరిచయం చేసుకున్నారు నిందితులు. వారి వద్ద ఓ 'మ్యాజిక్ మిర్రర్' (మాయా అద్దం) ఉందని.. దానితో మనుషులను నగ్నంగా చూడవచ్చని అవినాశ్ కుమార్‌కు చెప్పారు. భవిష్యత్తును కూడా అంచనా వేయవచ్చని నమ్మబలికారు.
Old Man Duped for Magic Mirror :మ్యాజిక్ మిర్రర్ విలువ దాదాపు రూ.2 కోట్లు ఉంటుందని.. కానీ దాన్ని కేవలం 9 లక్షల రూపాయలకే అమ్ముతున్నట్లు వృద్ధుడికి మాయ మాటలు చెప్పారు. మొదట్లో నిందితుల మాటలపై సందేహం వ్యక్తం చేసిన అవినాశ్ కుమార్.. మాయా అద్దాన్ని కొనేందుకు సంకోచించాడు. దీంతో ఈ అద్దాన్ని చాలా మంది కొన్నట్లుగా తప్పుడు పత్రాలను బాధితుడికి చూపించారు నిందితులు.అమెరికా నాసా శాస్త్రవేత్తలుకూడా ఈ అద్దాన్ని ఉపయోగించారని అతడ్ని నమ్మించారు. చివరకు ఆ అద్దాన్ని కొనేందుకు ఒప్పుకున్న అవినాశ్ కుమార్.. అనంతరం ఒడిశా రాజధాని భువనేశ్వర్‌కు పయనమయ్యాడు.