తమిళనాడులోని నీలగిరి జిల్లా మసినగుడి (Masinagudi Tiger) ప్రాంతంలో ఇప్పటికే నలుగురిని చంపి స్థానికులను భయాందోళనకు గురిచేస్తున్న పులి సంచారంపై మద్రాస్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. టీ23గా పేర్కొంటున్న ఆ పులిని చంపొద్దని (T 23 Tiger News) అటవీ శాఖకు ఆదేశాలు జారీ చేసింది. ఇతర జంతువులకు ఇబ్బంది కలగకుండా పులిని పట్టుకోవాలని సూచించింది. పులిని పట్టుకోవడంపై నివేదికను సమర్పించాలని ఆదేశించింది. ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన సంగీత డోగ్రా అనే వన్యప్రాణుల సంరక్షణ కార్యకర్త దాఖలు చేసిన పిటీషన్‌పై విచారణలో భాగంగా ఈ వ్యాఖ్యలు చేసింది.
'అధికారులు చట్టాల ఉల్లంఘనకు పాల్పడ్డారు'
మసినగుడి ప్రాంతంలో (Masinagudi Tiger) పులి దాడులకు నలుగురు ప్రాణాలు కోల్పోయారు. భయాందోళలకు గురైన స్థానికులు పులిని ఎలాగైన చంపాల్సిందేనంటూ డిమాండ్ చేశారు. దీనిపై స్పందించిన ఆ రాష్ట్ర చీఫ్ వైల్డ్‌లైఫ్ వార్డెన్ శేఖర్ కుమార్ నీరజ్.. పులిని చంపాలని ఈనెల 1న ఆదేశాలు జారీ చేస్తూ 5 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు.
ఈ చర్యను వ్యతిరేకించిన సంగీత డోగ్రా.. అక్టోబరు 2న మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ పులి మనుషులను వేటాడే మృగమో కాదో శాస్త్రీయంగా రుజువు కాలేదని.. అధికారులు చట్టాల ఉల్లంఘనకు పాల్పడ్డారని పిటిషన్లో పేర్కొన్నారు.