Madras HC on private tuition: ప్రైవేటుగా ట్యూషన్లు చెబుతున్న ప్రభుత్వ ఉపాధ్యాయులకు మద్రాస్ హైకోర్టు షాకిచ్చింది. పనిచేస్తున్న ప్రాంతాల్లో ప్రైవేటుగా ట్యూషన్లు చెబుతూ వ్యాపారం చేస్తున్న వీరిపై చర్యలు తీసుకోవాలని తమిళనాడు ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. ఇందుకోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలని నిర్దేశించింది.
Govt teachers Private tuition
రాధా అనే ఓ ప్రభుత్వ ఉపాధ్యాయురాలు.. తనను వేరే జిల్లాకు బదిలీ చేయడాన్ని వ్యతిరేకిస్తూ దాఖలు చేసిన వ్యాజ్యంపై విచారణ చేపట్టిన ఏకసభ్య ధర్మాసనం తాజా ఆదేశాలు జారీ చేసింది. వాదనలు విన్న న్యాయమూర్తి ఎస్ఎం సుబ్రహ్మణియన్.. ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు అందిస్తున్న విద్య నాణ్యతపై ప్రశ్నలు సంధించారు. ప్రభుత్వ టీచర్లు తమ డిమాండ్లపైనే ఎక్కువగా దృష్టిసారించారని అన్నారు. విద్యాశాఖ నిర్ణయాల్లో టీచర్ల సమాఖ్యలు జోక్యం చేసుకుంటున్నాయని ఆక్షేపించారు. పాఠశాలల లోపల, వెలుపల.. టీచర్లు సాగించే చట్టవిరుద్ధ కార్యకలాపాలు, అవకతవకలు, దుష్ప్రవర్తనల గురించి ఫిర్యాదు చేసేందుకు టెలిఫోన్ నెంబర్ను ఏర్పాటు చేయాలని విద్యాశాఖను ఆదేశించారు.
ఇదీ చదవండి:ఇక పూర్వాంచల్ సమరం.. మిత్రపక్షాల సత్తాకు పరీక్ష!