తెలంగాణ

telangana

By

Published : Mar 7, 2021, 1:21 PM IST

ETV Bharat / bharat

భవన నిర్మాణ కూలీ నుంచి.. పద్మశ్రీ గ్రహీతగా!

పొట్టకూటి కోసం కూలీగా మారిందామె. ఇటుకలు మోసి, కట్టిన భవనంలోనే ఇప్పుడు ప్రధాన అతిథిగా వేదిక మీద కూర్చుంది. దేశవిదేశాల్లో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ఆమెను.. భారత ప్రభుత్వం పద్మశ్రీ అవార్డుతోనూ సత్కరించింది. ఇంతకీ ఎవరా మహిళ? ఆమె ప్రత్యేకత ఏమిటి? ఈ కథనంలో చూద్దాం.

madhyapradesh bhopal based artist bhuri bhai got padmasri
పద్మశ్రీ భురీ భాయి ప్రతిభకు కొదువ లేదోయి!

భురీ భాయి ప్రతిభకు కొదువే లేదోయి..

రంగురంగుల చిత్రాలతో అందంగా కనిపిస్తున్న ఈ గోడలు.. భోపాల్‌లోని భారత్‌ భవన్‌వి. ఈ చిత్రాలు ఓ మహిళా కళాకారిణి కష్టానికి ప్రతిరూపాలు. ఓ మారుమూల పల్లె నుంచి, పట్నానికి తన ప్రతిభ చేరేందుకు ఆ మహిళ పడిన తపన, ప్రతి చిత్రంలోనూ కనిపిస్తుంది. ఆ శ్రమే ఆమెకు పద్మశ్రీ అవార్డును తెచ్చిపెట్టింది. ఆ మహిళే భురీ బాయి. భారత్ భవన్ నిర్మాణానికి ఇటుకలు మోసిన భురీ బాయి.. అక్కడే పద్మశ్రీ భురీ బాయిగా.. అతిథిగా హాజరైంది.

మధ్యప్రదేశ్‌, ఝబువా జిల్లాలోని పిటోల్‌ భురీ బాయి పుట్టిన ఊరు. 17 ఏళ్ల వయసులో వివాహం చేసుకుని, భోపాల్‌కు వచ్చేసింది. భారత్‌ భవన్‌ గోడలపై చిత్రాలు గీసి తానేంటో నిరూపించుకుంది భురీ బాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగానే కాదు.. విదేశాల్లోనూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.

''2002 నుంచి ట్రైబల్ మ్యూజియంలో పెయింటింగ్స్ వేస్తున్నా. చాలా కొత్త పనులు వచ్చి చేరాయి. నా వెనక ఉన్న 70 అడుగుల పొడవైన గోడపై నా జీవితాన్ని గీశా. ఎలా కష్టపడ్డాను, ఈ స్థాయికి ఎలా చేరాను.. అదంతా బొమ్మల్లో చూపించాను. భారత్‌ భవన్‌ వద్ద పనిచేసే సమయంలో ఓ రైలులో వస్తువులు అమ్ముతూ కనిపించే ఓ అమ్మాయి చిత్రం గీశాను. భారత్ భవన్ నిర్మాణం పూర్తయ్యాక, ప్రతి ఒక్కరినీ కలిశా. ఇందిరాగాంధీని కలిసి, నాకు వచ్చిన అవార్డు చూపించా.''

-పద్మశ్రీ భురీ బాయి, చిత్రకారిణి

పద్మశ్రీ భురీబాయికి చిన్నప్పటినుంచీ పెయింటింగ్‌ అంటే ఆసక్తి. తన ఇంటి గోడలపై ఎప్పుడూ బొమ్మలు గీస్తూ ఉండేది. పదేళ్ల వయసులోనే తల్లిదండ్రులతో కలిసి పని కోసం వెళ్లేది. ఓరోజు ఇంట్లో మంటలు చెలరేగి, సర్వం కోల్పోయింది భురీ బాయి కుటుంబం. తిండి గింజల కోసం నానా అవస్థలు పడాల్సి వచ్చేది. అప్పటినుంచీ తోబుట్టువులంతా కలిసి, కూలీలుగా మారి, బతకడం అలవాటు చేసుకున్నారు. పెళ్లి తర్వాతా.. కూలీ పని కోసం భర్తతో కలిసి వెళ్లేది భురీబాయి. అలా భారత్‌ భవన్ కడుతున్నప్పుడు కూలీ పని చేసింది. ఆ సమయంలో గురు జై స్వామినాథన్‌ను కలిసింది. ఊర్లో తాను పడ్డ కష్టాన్ని చిత్రం రూపంలో గీసి చూపించింది. ఆ కళాఖండాన్ని స్వామినాథన్‌ మెచ్చుకున్నాడు. అప్పటినుంచీ భురీ బాయి పెయింటింగ్స్‌కు గుర్తింపు వచ్చింది. కూలీ పని చేసిన భారత్‌ భవన్‌లోనే భురీబాయి ప్రధాన అతిథిగా మారింది. ఇదంతా తనకు కలలా ఉందని చెప్తోంది.

ప్రతిభ ఉంటే గమ్యాన్ని చేరుకోవడంలో ఎవరూ అడ్డు రాలేరని చెప్తోంది భురీబాయి. కాలానికి తగ్గ మార్పులు చేసుకుంటూ, పట్టుదలతో కష్టపడితే అనుకున్నది సాధించడం పెద్ద కష్టమేమీ కాదంటోంది.

''జీవితంలో చాలా కష్టాలు ఎదుర్కొన్నా. నా తల్లిదండ్రులు బీదవారు. నాకు ఓ సోదరి. ఇద్దరం కలిసి, కూలీ పని చేశాం. ఎనిమిది, పదేళ్ల వయసు నుంచే కూలీ పనికి వెళ్లేవాళ్లం.''

- పద్మశ్రీ భురీబాయి, చిత్రకారిణి

పద్మశ్రీ భురీ బాయి.. పెయింటింగ్స్ కోసం పేపరు, కాన్వాసు వాడుతున్న మొదటి మహిళా భీల్ కళాకారిణిగా గుర్తింపు తెచ్చుకుంది. అడవులు, జంతువులు, పచ్చదనం, దేవతామూర్తుల అవతారాలు, పూరిగుడిసెలు, సంప్రదాయ నగలు.. వీటికే తన పెయింటింగ్స్‌లో స్థానమిస్తుంది. మధ్యప్రదేశ్‌ మ్యూజియం సహా.. ఇతర రాష్ట్రాల్లోనూ ఆమె కళాఖండాలు ప్రదర్శనకు ఉంచారు. అమెరికాలోనూ భురీ బాయి పెయింటింగ్స్‌కు గుర్తింపు ఉంది. వివిధ ప్రాంతాల్లో భిల్‌ పెయింటింగ్స్, పితోరా ఆర్ట్‌పై వర్క్​షాప్‌లు నిర్వహిస్తోంది. ఇతర కళాకారులతో చేతులు కలిపి, ఈ సంప్రదాయ జానపద కళను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లింది భురీబాయి.

''నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ చేతులతోనే ఈ గోడలు కట్టాను. ఇదే భవనంలో నాకు అవకాశం వచ్చింది. భారత్‌ భవన్‌లో నిలబడితే.. స్వామీజీ ఆశీర్వదిస్తున్నట్లు, ఆయన నా వద్దే ఉన్నట్లు అనిపిస్తుంది.''

- పద్మశ్రీ భురీబాయి, చిత్రకారిణి

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details